Friday, April 26, 2024

రైతులను ఆదుకునే పార్టీకి అండగా ఉండాలే.. ఉత్తరాఖండ్ ర్యాలీలో రాహుల్

చలికి వణుకుతూ.. ఎండలో చెమటలు కక్కుతూ ఏడాది పాటు కరోనా మహమ్మారికి కూడా భయపడకుంటా రోడ్లపై రైతులు ఆందోళన చేస్తుంటే ప్రధానమంత్రి మోడీ పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను ఈ దేశానికి రాజును అనుకుంటున్నాడని, తాను చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. అతనేం నిర్ణయం తీసుకున్నా ప్రజలు నిశ్శబ్దంగా ఉండాలని.. నోరు మెదపొద్దని.. మోడీ తీరు అట్లానే ఉందని విమర్శించారు. ఇవ్వాల ‘‘ఉత్తరాఖండ్ కిసాన్ స్వాభిమాన్ సంవాద్’’ ర్యాలీలో రైతులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. రైతులు, యువకులు, పేదల భాగస్వామ్యంతో పనిచేసే ప్రభుత్వాన్ని అందించాలని కాంగ్రెస్ భావిస్తోందని అన్నారు. ‘‘అందరి కోసం పని చేయకపోతే అతను ప్రధాని కాలేడు.. ఆ లెక్క  ప్రకారం నరేంద్ర మోడీ అస్సలు ప్రధాని కానే కాదు’’ అని ర్యాలీ సందర్భంగా తీవ్ర విమర్శలు చేశారు రాహుల్.

కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు రుణమాఫీ కోసం తమను సంప్రదించారని.. దాన్ని 10 రోజుల్లోనే చేసి చూపించాం అని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఉదాహరణగా చూపుతూ చెప్పారు రాహుల్ గాంధీ. రైతులకు రూ.70 వేల కోట్ల రుణమాఫీ చేసినట్టు గుర్తు చేశారు. ఇదేమీ ఉచిత బహుమతి కాదు. రైతులు దేశం కోసం 24 గంటలు పని చేస్తారు కాబట్టి రుణమాఫీ చేశాం అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడూ డోర్స్ తెరిచే ఉంచిందని, రైతులు, పేదలు, కార్మికుల భాగస్వామ్యంతో పని చేయాలని తాము కోరుకుంటున్నామన్నారు. తద్వారా ప్రతి వర్గం తమ ప్రభుత్వమని భావించాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. మనకు ధనిక పారిశ్రామికవేత్తలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, మెర్సిడెస్ కార్లు ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా మరోవైపు పేదలు, నిరుద్యోగుల భారతదేశం మరొకటి ఉంది. ఎంపిక చేసిన 100 మంది వ్యక్తుల వద్ద దేశ జనాభాలో 40 శాతం సంపద ఉంది. ఆదాయ వ్యత్యాసాలు మరెక్కడా కనిపించడం లేదని రాహుల్ మండిపడ్డారు.  

“మాకు ఇట్లాంటి రెండు భారతదేశాలు వద్దు.. ఒకే భారతదేశం కావాలి. అన్యాయం అంతం కావాలి.” అని సమాజంలోని అంతరాన్ని ప్రస్తావించారు. ఏడాది పాటు ఆందోళనలు చేసి బీజేపీ మెడలు వంచి మరీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయించినందుకు రైతులను రాహుల్ గాంధీ అభినందించారు. అన్యాయం జరుగుతున్నందునే రైతుల పోరాటానికి కాంగ్రెస్‌ అండగా నిలిచిందని చెప్పారు కాంగ్రెస్ పార్ట మాజీ చీఫ్ రాహుల్ గాంధీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement