Tuesday, April 30, 2024

దేశ భద్రతపై మోడీ ప్రభుత్వం రాజీపడుతోంది.. ఉపాధి ప‌థ‌కంతో అగ్నిప‌థ్ స‌మానం: కెప్టెన్​ ఉత్తమ్​

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం దేశ భద్రత విషయంలో రాజీపడిందని, అగ్నిపథ్‌ అనే పథకం పూర్తిగా లోపభూయిష్టమైదని టీ పీసీసీ మాజీ చీఫ్​ కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ అగ్నిపథ్‌ పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పోల్చవచ్చని ఆయన విమర్శించారు. నిరుద్యోగ యువతకు సాయుధ దళాలలో కేవలం నాలుగేళ్ల సేవకు పరిమితం చేయడానికి కేంద్రం చేస్తన్న ప్రయత్నం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

శుక్రవారం ఆయన జూమ్‌యాప్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్‌ అనాలోచిత నిర్ణయమని మండిపడ్డారు. సాయుధ బలగాల్లో కాంట్రాక్టు ఉద్యోగాలను ప్రవేశపెట్టాలని చూస్తోందన్నారు. ‘ అగ్నిపథ్‌ ద్వారా పెన్షన్‌ బిల్లులో కొంత మొత్తాన్ని తగ్గించడం సరికాదు. మిగతా దేశాల్లో అమలవుతున్నాయని బీజేపీ చెబుతున్న విధానాలను మన దేశంలో చెల్లవు. సైనికుడు ఎలాంటి భయం లేకుండా తన జీవితాన్ని దేశానికి అంకితం చేస్తాడు.

అగ్నివీర్లు అని పిలవబడే పార్ట్‌ టైమ్‌ సైనికుల్లో దేశ అంకిత భావం లోపిస్తుంది. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, పారా మిలటరీ బలగాలకు సర్వీసు అనంతరం రాష్ట్ర సర్వీసుల్లో ప్రాధాన్యత ఇస్తామనడంలో నమ్మశక్యంగా లేదు. అలాంటప్పుడు మాజీ సైనికులు, ఇతర పారా మిలటరీ బలగాలకు ఉద్యోగాలు కల్పించాలి. మిలటరీలో ఖాళీగా వేలాది ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. సాయుధ బలగాలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పరిగణించ వద్దు ‘ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు ఆకస్మిక నిరసనగా భావించాలని ఆయన సూచించారు. నిరసనల వెనక కుట్ర ఉందనడం బీజేపీ నేతల మూర్ఖత్వమని ఆయన మండిపడ్డారు. సాయుధ దళాల్లో దాదాపు 1.40 లక్షల ఖాళీలుండగా బీజేపీ ప్రభుత్వం కేవలం 46 వేల ఖాళీలను భర్తీ చేయాలని చూస్తోందని ఉత్తమ్‌ విమర్శించారు. కోవిడ్‌ వల్ల గత రెండేళ్లుగా రిక్రూట్‌మెంట్‌ లేకపోవడంతో నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు.

సాధారణ రిక్రూట్‌మెంట్‌ కాకుండా కాంట్రాక్టు ప్రతిపాదికన ఉద్యోగాలు ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించడంతోనే నిరుద్యోగులు నిరాశ, కోపంతో ఉన్నారని ఆయన తెలిపారు. కాంట్రాక్టు ప్రతిపాదికన సాయుధ దళాల్లో ఉద్యోగాలు కల్పించే విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌ పథకం పూర్తిగా ఆశాస్త్రీయమైన పథకమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement