Friday, May 3, 2024

కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా మోడలింగ్, డ్యాన్సింగ్ – సోద‌రిని హ‌త‌మార్చిన సోద‌రుడు

పాకిస్థాన్ లో ప‌రువు హ‌త్య జ‌రిగింది.సొంత సోద‌రిని సోద‌రుడు తుపాకితో కాల్చి చంపాడు. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగింది. ప్రావిన్షియల్ రాజధాని లాహోర్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెనలా ఖుర్దా ఒకారాకు చెందిన 21 ఏళ్ల సిద్రా స్థానిక క్లాతింగ్ బ్రాండ్‌కు మోడలింగ్ చేస్తోంది. ఫైసలాబాద్‌లో థియేటర్లలో నృత్యం కూడా చేస్తోంది. కుమార్తె చేస్తున్న ఈ పనులు తల్లిదండ్రులకు సుతరామూ ఇష్టం లేదు. ఈ రెండింటినీ విడిచిపెట్టాలని తల్లిదండ్రులు పలుమార్లు కుమార్తె సిద్రాను హెచ్చరించారు. ఇది మన సంప్రదాయం కాదని, బుద్ధిగా ఉండాలని నచ్చజెప్పారు. అయితే, అందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఈద్‌ను జరుపుకునేందుకు గతవారం ఆమె ఫైసలాబాద్ నుంచి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో గురువారం తల్లిదండ్రులు, సోదరుడు హమ్జా మరోమారు ఆమెతో వాగ్వివాదానికి దిగారు. అయినప్పటికీ ఆమె తన ప్రొఫెషన్‌ను వదులుకోవడానికి అంగీకరించలేదు. తాము ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన సోదరుడు హమ్జా సోదరిని తుపాకితో కాల్చి చంపాడు.హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు హమ్జాను అరెస్ట్ చేశారు. హత్య తానే చేసినట్టు హమ్జా పోలీసు విచారణలో అంగీకరించాడు. బంధువు ఒకరు తనకు ఫార్వార్డ్ చేసిన వీడియోలో సోదరి నృత్య ప్రదర్శనను చూసి హమ్జా కోపోద్రిక్తుడయ్యాడని, హత్యకు అదే కారణమని పోలీసులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement