Saturday, May 4, 2024

ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడనున్నారా ?

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగలనుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జగ్గారెడ్డి.. ఈ రోజు రాజీనామా ప్రకటించే యోచనలో ఉన్నారు. దీనిపై ఇప్పటికే తన అనుచరులతో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఏ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగానే ఉంటానని చెప్పారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనను అవమానించారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలోని కొందరు కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ పార్టీ కార్యాచరణపై కనీస సమాచారం ఇవ్వట్లేదని.. ఇది తనను అవమానించడమేనని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలను సహించలేనని.. అందుకే పార్టీని వీడాలని జగ్గారెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాజీనామా లేఖను నేడు అధిష్ఠానానికి సమర్పించే అవకాశం ఉంది. పార్టీని వీడడానికి గల కారణాలను వివరిస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయాలని కూడా జగ్గారెడ్డి భావిస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి మధ్య గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. పలుమార్లు రేవంత్‌పై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్‌రెడ్డికి ఇవ్వడాన్ని తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి.. పలుమార్లు బాహాటంగానే తన వ్యతిరేకతను బయటపెట్టారు. నిన్నమొన్నటి వరకు కేసీఆర్, కేటీఆర్‌పై విరుచుకుపడిన జగ్గారెడ్డి ఇటీవల దూకుడు తగ్గించారు. అంతేకాదు ఇటీవల సంగారెడ్డి పర్యటన సందర్భంగా మంత్రి హరీష్ రావుపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ఆయన తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

కాగా, 2018 ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన ఎకైక ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ఉన్నారు. 2004లో టీఆర్ఎస్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2009, 2018 ఎన్నికల్లో గెలిచారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్ధి చింతా ప్రభాకర్‌ చేతిలో ఓడిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement