Sunday, April 28, 2024

కేసీఆరే తెలంగాణ‌కు శ్రీరామ‌ర‌క్ష

కృష్ణా జ‌లాల విష‌యంలో రాజీ లేకుండా పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే అని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు రెండు నాలుక‌ల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారని విమర్శించారు. మంత్రి మ‌ల్లారెడ్డి ఆధ్వ‌ర్యంలో మేడ్చల్ జిల్లా జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ కార్పొరేష‌న్‌లోని న‌లుగురు కాంగ్రెస్ కార్పొరేట‌ర్లు, ఘ‌ట్‌కేస‌ర్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు టీఆర్ఎస్ పార్టీలో  చేరారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి కేటీఆర్ సాద‌రంగా ఆహ్వానించారు. అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ..  కేసీఆర్ నాయ‌క‌త్వ‌మే తెలంగాణ‌కు శ్రీరామ‌ర‌క్ష అని భావించి.. ఇత‌ర పార్టీల నేత‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రాన్ని సాధించుకోవ‌డమే కాదు.. అభివృద్ధి బాట‌లో ప‌య‌నింప‌జేస్తున్నామ‌ని చెప్పారు. అన్ని వ‌ర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నాం.

క‌రోనాను కూడా లెక్క చేయ‌కుండా అభివృద్ధి ఫ‌లాలు సామాన్యుల‌కు అందించామ‌న్నారు. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోనే 10 మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లు ఉన్నాయని, అంద‌రి మ‌ద్ద‌తుతో ప‌దింటికి ప‌దిని మంత్రి మ‌ల్లారెడ్డి గెలిపించుకున్నారని తెలిపారు. ప్ర‌జ‌ల్లో పార్టీపై విశ్వాసం ఉండ‌డం వ‌ల్లే గెలుపు సాధ్య‌మైతుంద‌న్నారు. అత్యంత ఎక్కువ స‌మ‌స్య‌లు ఉన్న ప్రాంతం జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ అని, ఈ కార్పొరేష‌న్ అభివృద్ధికి త‌ప్ప‌కుండా నిధులు మంజూరు చేస్తామ‌ని చెప్పారు. జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ ప్ర‌జ‌ల‌కు దుర్గంధం లేకుండా చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు. జీవో నం. 58, 59 ప్ర‌కారం ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చిన‌ట్లే.. ఇవ్వాల‌ని జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ ప్ర‌జ‌లు కోరారని, హెచ్ఎండీఏ ప‌రిధిలో ఉంది కాబ‌ట్టి ఆ ప్ర‌కారం ఇళ్లు ప‌ట్టాలు ఇవ్వ‌లేక‌పోయామన్నారు. ఈ స‌మ‌స్య‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కారిస్తామ‌ని చెప్పారు. న‌గ‌ర శివారు మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని మంత్రులు మ‌ల్లారెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డికి సూచించామ‌ని మంత్రి కేటీఆర్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement