Thursday, May 2, 2024

కేంద్రం వడ్లు కొనేదాకా బరిగీసి కొట్లాడుతాం: మంత్రి కొప్పుల

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండించిన వరిధాన్యం కొనుగోలు చేసే వరకు బరిగీసి కొట్లాడుతామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. గురువారం పద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద తెరాస పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులను చిన్నచూపు చూస్తుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, కాళెశ్వరం ప్రాజెక్టుతో రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. కెద్రంలోని మోడీ సర్కారు రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుందన్నారు. రైతుల ధాన్యం కొనేంత వరకు కేంద్రంపై పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఈనెల 11న ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిరసన దీక్ష చేపట్టనున్నట్లు- తెలిపారు. 8న అన్ని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇండ్లపై నల్ల జెండాలు ఎగర వేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌ రెడ్డి, కోరుకంటి చందర్‌, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, ప్రజాప్రతినిధులు, రైతు అనుబంధ సంఘాల బాధ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement