Saturday, May 4, 2024

Red Flag | మావోయిస్టు అగ్ర‌నేత‌ కటకం సుదర్శన్ చివరి సందేశం.. ఏం చెప్పారో తెలుసా?

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ (ఆనంద్, దూల దాదా)కు చెందిన చివరి సందేశాన్ని మావోయిస్టు పార్టీ మీడియాకు రిలీజ్ చేసింది. తాను విప్లవ మార్గం ఎంచుకొన్నానని త‌న సందేశంలో విప్ల‌వ యోధుడు స్పష్టం చేశారు. తాను ఎంచుకున్న మార్గంలో ప‌య‌ణించి దేశంలో విప్లవోద్యమ పురోగమనంలో తన వంతు బాధ్యతను నెరవేర్చానని గర్వంగా ప్రకటించుకున్నారు. అయితే దేశంలో విప్లవ పునాదులు బలంగా పడ్డాయన్నారు. కానీ, విప్లవోద్యమం పూర్తి అయి, తాము కోరుకున్న సమాజం, అంటే నూతన ప్రజాస్వామిక విప్లవం, సోషలిజం రాకపోయినప్పటికీ ఆ మార్గంలో చాలా ముందుకు నడిచానని చెప్పుకొచ్చారు. ఒక గొప్ప మార్పు మనం కోరుకున్నప్పుడే సాధ్యం కాకపోవచ్చునాని. ముఖ్యంగా విప్లవోద్యమ విజయానికి అనేక అంశాలు తోడు కావలసి ఉంటుంద‌ని ఈ పోరాట యోధుడు త‌న సందేశంలో తెలిపారు.

అందులో ప్రధానంగా ప్రజలు ముందుకొచ్చినప్పుడే విజయవంతమవుతుందని మావోయిస్టు అగ్ర‌నేత క‌ట‌కం సుద‌ర్శ‌న్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలు మరింత గట్టిగా నిలిచి, ఐక్యంగా విజయం కోసం పోరాడితే తప్ప, అనుకొన్న గమ్యం సాకారం కాబోధాని తెలుసుకొన్ననన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదని.. ప్రజలే విప్లవోద్యమానికి నిజమైన కర్తలని తేల్చి చెప్పారు. కొత్త బిడ్డకు తల్లి జన్మనివ్వడానికి మంత్రసాని లాంటి పని పార్టీ చేస్తుందని, ఈ కర్తవ్యాన్ని పార్టీ గొప్పగా నెరవేర్చగలదన్నారు.

ప్రస్తుత ప్రభుత్వాలు ఎన్ని పాట్లు పడినా ప్రజలను మభ్య పెట్టలేరని విమర్శించారు. పాలకవర్గాలైన సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా, భూస్వామ్య వర్గాలను అధికారం నుండి కూలదోసి దేశంలో కార్మికవర్గ నేతృత్వంలో విప్లవాన్ని విజయవంతం చేయడం ఖాయమన్నారు. ఈ విశ్వాసంతో ప్రజలంతా ఉండాలని, అందుకు మన కుటుంబం విప్లవ విశ్వాసంతో తోచిన పద్దతుల్లో నిలబడుతుందని స్పష్టం చేశారు. విప్లవ సాంప్రదాయాలకు ఎలాంటి హాని జరగకుండ ప్రవర్తిస్తారని బలంగా కోరుకుంటున్నట్లు ఆ సందేశంలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement