Wednesday, May 1, 2024

లాల్ సింగ్ చ‌డ్డా మూవీ రివ్యూ-బాలీవుడ్ కి హిట్ ఇచ్చిందా..!

హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ ని ఇష్ట‌ప‌డి ఆ చిత్రం ఆధారంగా లాల్ సింగ్ చ‌డ్డాని నిర్మించారు హీరో అమీర్ ఖాన్. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. అమీర్ ఖాన్ సినిమాల మీద ఉన్న గురికి తోడు అక్కినేని నాగచైతన్య ఇందులో కీలక పాత్ర పోషించడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. మ‌రి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం..

క‌థ ఏంటంటే – అమిర్ ఖాన్ చిన్నతనంలోనే తండ్రికి దూరమై.. తల్లి మోనా సింగ్ సంరక్షణలో పెరిగి పెద్దవాడ‌వుతాడు. కొంచెం బుద్ధి మాంద్యం లక్షణాలున్న అతను తన తల్లి.. అలాగే తన చిన్ననాటి స్నేహితురాలైన రూప కరీనా కపూర్ సాయంతో జీవితంలో ముందడుగు వేస్తూ సాగుతాడు. పెద్దవాడయ్యాక మిలిటరీలో చేరిన అతడికి నాగచైతన్య తో స్నేహం కుదురుతుంది. ఐతే తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఒక్కొక్కరుగా అతడికి దూరం అయిపోతారు. మరి ఈ ఎదురు దెబ్బల్ని తట్టుకుని లాల్ సింగ్ తన జీవిత ప్రయాణాన్ని ఎక్కడిదాకా తీసుకెళ్లాడో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌-ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రీమేక్ సినిమా తీసి సక్సెస్ సాధించడం పెద్ద సవాలు. మేటి నటుడు.. కథల ఎంపికలో.. సినిమాల మేకింగ్ మీద గొప్ప పట్టు ఉన్న అమిర్ ఖాన్ ఏరికోరి 28 ఏళ్ల నాటి హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ ఆధారంగా లాల్ సింగ్ చడ్డా సినిమా చేసేసరికి ఇందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుందని.. తన టీంతో కలిసి అమిర్ ఏదో మ్యాజిక్ చేసే ఉంటాడని ఆశిస్తాం. కానీ ఆశ్చర్యకరంగా అమిరే ఈ సినిమాకు అతి పెద్ద బలహీనతగా మారడం.. తన యాక్ట్స్ అన్నీ పేలవంగా మారడం.. ఫారెస్ట్ గంప్ లో ఉన్న ప్యూరిటీ.. ఫీల్ ఇందులో మిస్ అయిన‌ట్ల‌నిపిస్తుంది. మాతృకతో పోలిస్తే నేటివిటీ పరంగా మార్పులు చేర్పులు చేయడానికి అతుల్ కులకర్ణి బాగానే కష్టపడ్డాడు. 80వ దశకంతో కథను మొదలుపెట్టి స్వర్ణ దేవాలయంపై దాడి.. 1983 వన్డే ప్రపంచకప్ విజయం.. ఎమర్జెన్సీ.. ఇందిరాగాంధీ హత్య.. సిక్కుల ఊచకోత.. అద్వానీ రథ యాత్ర.. ఇలా అనేక అంశాలను టచ్ చేస్తూ హీరో ప్రయాణాన్ని చూపించే ప్రయత్నం చేశారు.

- Advertisement -

ఈ సినిమాలో నాగచైతన్య చేసిన బాలరాజు పాత్ర విషయానికి వస్తే.. ఇది కూడా అనుకున్నంత ప్రభావవంతంగా లేదు. ఒరిజినల్లో కదిలించేలా ఉండే ఈ పాత్ర ఇక్కడ విఫలమవడానికి కారణాలేంటో విశ్లేషించడం కూడా కష్టమే. ఇక సినిమాలో పూర్తిగా మిస్ ఫిట్ అనిపించే మరో పాత్ర కరీనా కపూర్ చేసిన రూప. 40 ఏళ్లు దాటి ఇద్దరు పిల్లల తల్లి అయిన కరీనా.. ఇందులో హీరోతో టీనేజీ నుంచి సాగే పాత్రలో ఎంతమాత్రం ఫిట్ అనిపించదు. చాలా అసహజంగా అనిపించే తన పాత్ర తెరపై కనిపించినపుడల్లా చికాకు పుడుతుందే తప్ప మంచి ఫీలింగ్ ఇవ్వదు.

న‌టీన‌టుల విష‌యానికొస్తే-అమిర్ ఖాన్ కెరీర్ లో చాలా వరకు తన వల్ల ఇంకా మెరుగుపడ్డ పాత్రలే కనిపిస్తాయి కానీ.. తన వల్ల పూర్తిగా దెబ్బ తిన్న పాత్రగా లాల్ సింగ్ చడ్డా నిలుస్తుంది. ఒరిజినల్ క్యారెక్టర్ ని కొంచెం భిన్నంగా చేసే ప్రయత్నంలో అమిర్ అదుపు తప్పాడు. తన లుక్స్.. హావభావాలు చాలా ఇబ్బందికరంగా మారాయి. చడ్డా పాత్ర తనకో చేదు జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం. కరీనా కపూర్ ను రూప పాత్రకు తీసుకోవడం మరో పెద్ద తప్పిదం. ఆమె పాత్రకు తగ్గట్లుగా కనిపించేందుకు బాగానే కష్టపడ్డప్పటికీ.. తను మిస్ ఫిట్ అనే అనిపిస్తుంది. ప్రత్యేక పాత్రలో నాగచైతన్య ప్రత్యేకమైన ముద్ర ఏమీ వేయలేకపోయాడు. హీరో తల్లి పాత్రలో మోనా సింగ్ పర్వాలేదు.

టెక్నీషియ‌న్స్ – లాల్ సింగ్ చడ్డాకు సాంకేతిక హంగులైతే బాగానే కుదిరాయి. దర్శకుడిగా అద్వైత్ చందన్ విఫలమయ్యాడు. ప్రీతమ్ పాటలు బాగున్నాయి. తెలుగు సాహిత్యం విషయంలో శ్రద్ధ పెట్టారు. మామూలుగా హిందీ డబ్బింగ్ సినిమాల్లోని పాటలతో పోలిస్తే ఇందులోనివి చాలా మెరుగ్గా. తరరంపం పాట శ్రావ్యంగా అనిపిస్తుంది. మిగతా పాటలూ ఓకే. తనూజ్ టికు నేపథ్యం సంగీతం కూడా బాగానే సాగింది. సత్యజిత్ పాండే విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల విషయంలో ఢోకా ఏమీ లేదు. బాగానే ఖర్చు పెట్టారు. ఈ సినిమాకు రచన చేసిన అతుల్ కులకర్ణిని తప్పుబట్టడానికేమీ లేదు. అతను తన ప్రయత్నం బాగానే చేశాడు. మొత్తానికి అమీర్ ఫ్యాన్స్ కి న‌చ్చేలా ఉన్న ఈ సినిమా జ‌యాప‌జ‌యాలు ప్రేక్ష‌కులు చూసే విధానంపై ఆధార‌ప‌డి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement