Wednesday, May 15, 2024

Big Story: కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌?.. పార్టీ కార్యక్రమాలకు దూరం దూరం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర కాంగ్రెస్‌కు మరో కుదుపు రానునున్నది. ఇప్పటికే పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు దూరం కాగా, ఇప్పుడు మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హస్తానికి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు కూడా ప్రధానంగా నే వినిపిస్తోంది. కాగా ఎంపీ వెంకట్‌రెడ్డి ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌తో పాటు పార్టీలో క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో .. పార్టీ మారే అంశంపై కొంత ఆలోచనలో పడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎంపీ వెంకట్‌రెడ్డి మాత్రం ఇటీవలనే ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలవడంతో పాటు వరుసగా కేంద్ర మంత్రులను కూడా నియోజక వర్గ అభివృద్ధిపై కలుస్తున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌ను వీడేందుకు మానసికంగా సిద్దమయ్యారని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడిన తీరు, బుధవారం నియోజక వర్గంలో స్పందించిన అంశాన్ని చూస్తుంటే కచ్చితంగా పార్టీ మార్పునకు సంకేతాలేనని స్పష్టమవుతోంది.

కేసీఆర్‌ను ఢీ కొట్టే పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం, ప్రధాన మంత్రి నరేంద్రమోడి నాయకత్వం దేశానికి అవసరమని ప్రకటించిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి బ్రదర్స్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లితే.. ఉమ్మడి నల్లగొండలో హస్తానికి మరిన్ని కష్టాలు వస్తాయి. టీ పీసీసీ చీఫ్‌ పదవి కోసం ఎంపీ కోమటిరెడ్డి అధిష్టానం వద్ద తీవ్రంగానే ప్రయత్నం చేశారు. చివరకు రేవంత్‌రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించడంతో.. ఎంపీ కోమటిరెడ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మానిక్యం ఠాగూర్‌, రేవంత్‌రెడ్డిపైన తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా గాంధీభవన్‌ మెట్లు ఎక్కేది లేదని చెప్పారు. అప్పటి నుంచి టీ పీసీసీ చీప్‌ రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ మధ్య గ్యాప్‌ పెరిగింది.

ఇదిలా ఉండగా వరంగల్‌ జిల్లాకు చెందిన కొండా దంపతులు కూడా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. పార్టీ సభ్యత్వ నమోదులోనూ ఆశించిన మేరకు పని చేయడం లేదని సమాచారం. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జిల్లాలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి కొండాసురేఖ, ఆయన భర్త కొండా మురళికి ఇప్పుడు జిల్లాలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌ మరణాంతరం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి సమక్షంలో సొంత గూటికి చేరుకున్నారు. అయితే హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో కొండా సురేఖ పోటి చేస్తారని మొదటగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పోటికి విముఖత వ్యక్తం చేయడంతో ఎన్‌ఎస్‌యూఐ నేతను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రేవంత్‌రెడ్డితో కొండా దంపతుల మధ్య గ్యాప్‌ ఏర్పడిందని కాంగ్రెస్‌ నాయకులే చెబుతున్నారు. వీరు కాంగ్రెస్‌లోనే ఉంటారా..? లేదంటే గుడ్‌బై చెప్పి బీజేపీలోకి వెళ్లుతారా..? అనేది చర్చగా మారింది. అయితే పార్టీ మారిన నాయకుల నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇంకా కోలుకోలేని పరిస్థితి నెలకొన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement