Friday, May 17, 2024

త్వరలో అందుబాటులోకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్.. ఎంపీ కేశినేనికి రైల్వే మంత్రి హామీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు కట్టుబడి ఉందని, ఇప్పటికే బిల్డింగ్ నిర్మాణానికి కావాల్సిన స్థలం, డీపీఆర్ పనులు జరుగుతున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలు, విజయవాడ రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు మెరుగుపరచడంపై బుధవారం లోక్‌సభలో టీడీపీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని ప్రసంగించారు. రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు 2019లో సౌత్ రైల్వే జోన్‌ను ప్రకటించినట్టు ఆయన గుర్తు చేశారు. రైల్వే జోన్ అంశం ఎప్పుడు ఆచరణలోకి వస్తుంది? జోన్ ఏర్పాటు పనులు ఎక్కడివరకు వచ్చాయని నాని ప్రశ్నించారు.

దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ త్వరలోనే ఆచరణలోకి వస్తుందని వెల్లడించారు. కాన్పూర్, హౌరా, ఢిల్లీ తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ అతి పురాతనమైనదని ఎంపీ సభ దృష్టికి తీసుకొచ్చారు. దేశంలోనే అత్యధికంగా రద్దీగా ఉండే రెండో రైల్వే స్టేషన్ అని, 256 ప్యాసింజర్ రైళ్లు, 140 గూడ్స్ రైళ్లతో ప్రతి ఏడాది ఐదు కోట్ల మంది ప్యాసింజర్లు ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తున్నారని ఆయన వివరించారు. ఎప్పుడూ రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నాని విజ్ఞప్తి చేశారు. ఎంపీ నాని లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని రైల్వే మంత్రి సమాధానమిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement