Saturday, May 4, 2024

వైద్య విద్య, రక్షణ రంగంలో కేంద్రం పాఠాలు నేర్చుకోవాలి.. ఉక్రెయిన్ విద్యార్థుల సమస్యలపై వైసీపీ ఎంపీలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వైద్య విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా స్వరాష్ట్రంలోనే చదువుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్‌లో చర్యలు తీసుకుంటుందని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పరిణామాలతో వైద్య విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు స్పందించారు. బుధవారం న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎంపీలు డాక్టర్ సత్యవతి, చింతా అనురాధ, గొడ్డేటి మాధవి, గురుమూర్తి, సంజీవ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 692 మంది వైద్య విద్యార్థులను స్వరాష్ట్రానికి తీసుకు వచ్చామని, విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ సత్యవతి కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి విద్యార్థుల తరలింపునకు హంగేరి, పోలాండ్, రొమేనియా, స్లోవేకియా దేశాలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను పంపిందని చెప్పారు. సీఎం జగన్ వైద్యానికి ప్రాధాన్యతనిస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్‌పై త్వరలో స్పష్టత వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 16 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 13 కాలేజీలకు శంకుస్థాపనలు పూర్తయ్యాయని చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్, కేంద్రంతో చర్చించి వైద్య విద్యార్థుల భవితవ్యం కోసం తమ వంతు కృషి చేస్తామని సత్యవతి భరోసా ఇచ్చారు. త్వరలో యుద్ధం సమసిపోవాలని ఆమె ఆకాంక్షించారు. ఉక్రెయిన్‌లో చనిపోయిన వైద్య విద్యార్థి నవీన్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.

అనంతరం ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ… ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉచిత రవాణా, వసతి, భోజన సౌకర్యాలు కల్పించిందని గుర్తు చేశారు. వైద్య విద్య, రక్షణ విభాగంలో కేంద్రం పాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. 10 వేల జనాభాకు 44 మంది వైద్య సిబ్బంది ఉండాల్సి ఉన్నా 23 మందే ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. విద్యార్థులు 7600 కోట్ల రూపాయలను ప్రతి ఏడాది విదేశాలకు చెల్లిస్తున్నారని, ఇదే డబ్బుతో ప్రతి ఏడాది 25 మెడికల్ కళాశాలలు భారత్‌లో స్థాపించవచ్చని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం గ్రామీణ భారతంలో మెడికల్ కళాశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భారత్‌లో వైద్య విద్యకు కోటి రూపాయలు ఖర్చవుతోందని, అదే విదేశాల్లో అయితే 25 లక్షలకే చదువు అయిపోతోందని వివరించారు. కేంద్రం నిధులు కేటాయించి వైద్య రంగాన్ని మెరుగు పరచాలని, రక్షణ రంగంపై కూడా దృష్టి సారించాలని సంజీవ్ కుమార్ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement