Friday, May 3, 2024

బీజేపీ నేతలతో కోమటిరెడ్డి భేటీలు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం!

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీ.పీసీసీ పదవి దక్కకపోవడంతో అసంతృప్తిలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తాను  కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పిన కోమటిరెడ్డి.. బీజేపీ నేతలను కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రేవంత్ రెడ్డిని టీపీసీసీగా నియమించిన తరువాత వెంకటరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక నుంచి తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కబోనని ప్రకటించారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తానని, హైదరాబాద్‌లో కూర్చుంటే క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారం కావని ఇటీవ వ్యాఖ్యానించారు. అయితే, ఢిల్లీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. శనివారం సైతం ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం కలిశారు. ఇటీవల క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ అందుకున్న కిషన్ రెడ్డిని విజ్ఞాన్ భవన్ లో కలిసిన కోమటిరెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ వారసత్వ సంపదగా భావించే భువనగిరి కోట అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. 

భువనగిరిలో పర్యాటక అభివృద్ధి అంశాలపై కిషన్ రెడ్డితో చర్చించినట్టు కోమటిరెడ్డి తెలిపారు. అయితే, అంతకుముందు పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. తెలుగు వారికి, దేశానికి పేరు తెచ్చేలా పనిచేయాలని కిషన్ రెడ్డిని ఈ సందర్భంగా కోరారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలు చర్చించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా, తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిమాణామాల నేపథ్యంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement