Tuesday, May 7, 2024

కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఎంపిక‌లో కేసీఆర్ దే కీల‌క పాత్ర‌.. బండి సంజ‌య్ ఆరోప‌ణ‌

బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా స‌హ‌క‌రించ‌డం వ‌ల్లే క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ విజ‌యం సాధించింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వ‌చ్చే తెలంగాణ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తీ కొన‌సాగుతుంద‌ని అన్నారు. హైద‌రాబాద్ లో నేడు బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశాన్ని జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… బీఆర్ఎస్ బ‌ల‌హీనంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు బాహాటంగానే కేసీఆర్ మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఎంపిక‌లో సైతం కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేసినా తాము సింగిల్​గానే పోటీ చేస్తామని.. తప్పకుండా ఈసారి తెలంగాణలో అధికారం సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 30 నుంచి జూన్ 30 వరకు బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని బండి సంజయ్ తెలిపారు.

30 రోజుల పాటు మోదీ విజయాలను, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. గత 9 ఏళ్లలో బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించారు. ఈ క్రమంలో అధికార బీఆర్​ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్‌కు కేసీఆర్ నిధులు సమకూర్చారని బండి సంజయ్ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికలకు, తెలంగాణ ఎన్నికలకు సంబంధం లేదని.. అక్కడ బీజేపీ ఓటు శాతం తగ్గలేదని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement