Friday, May 3, 2024

కేంద్రం మెడ‌లు వంచుదాం.. నిర‌ససెగ‌లు ఢిల్లీని తాకేలా పోరాటం

మన రాష్ట్ర రైతాంగం పండించిన వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర‌ ప్ర‌భుత్వం వివ‌క్ష చూపుతుంద‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ధ్వజ‌మెత్తారు. వ‌రి ధాన్యం కొనుగోళ్ల‌పై కేంద్ర వైఖ‌రికి నిర‌స‌న‌గా చేప‌ట్ట‌బోయే ఆందోళ‌నలు, భవిష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై నియోజ‌క‌వ‌ర్గ‌స్థాయి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌ల‌ స‌న్న‌హాక  స‌మావేశానికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు.  కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వ వైఖ‌రిని ఖండిస్తూ గ్రామ‌పంచాయ‌తీ, మండల ప్రజాపరిషత్,  జిల్లా, మండల స్థాయి రైతుబంధు సమన్వయ సమితి, మార్కెట్ కమిటీ,  పీఏసీఎస్, డిసిసిబీ, డీసీఎంస్, మున్సిపాలిటీల్లో తీర్మానాలు చేయాల‌ని చెప్పారు. అంద‌రిని స‌మ‌న్వ‌యప‌రుస్తూ పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్యక్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. యాసంగిలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంపై తిరుగుబాటు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. దేశానికి అన్నం పెట్టే రైత‌న్న‌ను నిర్ల‌క్ష్యం చేస్తే స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్మెంట్ ఫాలసీని వెంటనే ప్రకటించి, అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద అన్ని రకాల ధాన్యాలకు వర్తించే విధంగా ఏకరీతి జాతీయ ధాన్య సేకరణ విధానాన్ని రూపొందించాలన్నారు. వరి ధాన్యాన్ని 100% పూర్తిగా FCI ద్వారా కొనుగోలు చేయాలన్నారు. రైతు వ్య‌తిరేక విధానాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం విడనాడ‌ల‌ని, లేక‌పోతే రైత‌న్న‌ల‌తో క‌లిసి నిర‌స సెగ‌లు ఢిల్లీని తాకేలా పోరాటం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement