Monday, May 6, 2024

మీరు రోడ్లు బంద్‌ చేస్తే.. మేం కరెంటు, నీళ్లు బంద్‌ చేస్తం.. ప్రజలకోసం ఎంతకైనా తెగిస్తం: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ నగర అభివృద్ధికి అడ్డుపడుతున్న కంటోన్మెంట్‌ అధికారులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కంటోన్మెంట్‌ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వాళ్లు రోడ్లు బంద్‌ చేస్తే.. తాము కరెంట్‌, నీళ్లు బంద్‌ చేస్తామని తేల్చిచెప్పారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కార్వాన్‌ నియోజకవర్గంలో నెలకొన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఒక వైపు కంటోన్మెంట్‌లో చెక్‌ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోంది. చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్‌ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్‌ఐ అనుమతి ఇవ్వడం లేదు. ఒక వైపు కంటోన్మెంట్‌, మరో వైపు ఏఎస్‌ఐ అడ్డు పడుతోంది.

ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ వేరే దేశం అన్నట్టు కేంద్రం విచ్చలవిడిగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌లో ఉంటున్నప్పుడు కంటోన్మెంట్‌ కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్‌ చేస్తాం.. నాలాల మీద చెక్‌ డ్యాంలు కడుతామంటే మేం కూడా ఊరుకోం అని కేటీఆర్‌ హెచ్చరించారు. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం. అవసరమైతే మంచినీళ్లు, కరెంట్‌ బంద్‌ చేస్తాం. అప్పుడైనా దిగిరారా అని అన్నారు. కంటోన్మెంట్‌ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీని ఆదేశిస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలకు, కఠిన చర్యలకు కూడా వెనుకాడొద్దని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున శాసనసభలో చెప్తున్నానని కేటీఆర్‌ పేర్కొన్నారు. పైసా సాయం చేయరు కానీ, పని చేస్తున్న ప్రభుత్వానికి అవరోధం కలిగించడం సరికాదని కేటీఆర్‌ మండిపడ్డారు.

విశ్వనగరంగా మార్చేందుకు శ్రమిస్తున్నాం..
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు శ్రమిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగరంలో మురుగునీరు, మంచినీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో రూ.3866 కోట్లతో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఎస్టీపీ)లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ డిసెంబర్‌ నాటికి వంద శాతం ఎస్టీపీ పనులు పూర్తవుతాయి. హైదరాబాద్‌లో 37 చోట్ల ఎస్టీపీలు నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌కు రెండు వేల ఎల్‌ఎండీల మురుగునీటి శుద్ధీకరణ సామర్థ్యం ఉంది. హైదరాబాద్‌కు సాయం అడిగితే కేంద్రం పెద్దలు అమృత్‌లో చేరమన్నారు. లక్షకుపైగా జనాభా ఉన్న నగరాలు అమృత్‌లో చేరాలన్నారు. హైదరాబాద్‌లో కోటికిపైగా జనం నివసిస్తున్నారు. కేంద్రమిచ్చే రూ.200-300 కోట్లు ఏ మూలకు సరిపోతాయి. హైదరాబాద్‌లో గతేడాది వరదలు వచ్చినపుడు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కేంద్ర పెద్దలు చాలా మంది వరద ప్రాంతాలకు సందర్శించి పట్టించుకోలేదు. పైసా సాయం చేయలేదు. గుజరాత్‌కు మాత్రం ప్రధాని స్వయంగా వెళ్లి రూ.వెయ్యి కోట్ల సాయం ప్రకటించారన్నారు.

ఎస్‌ఎన్‌డీపీకి కేంద్ర సాయం శూన్యం..
స్ట్రాటజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం(ఎస్‌ఎన్‌డీపీ)లో భాగంగా హైదరాబాద్‌ నగరంలో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. పుణకు చెందిన షా కన్సెల్టెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం తొలుత పాత ఎంసీహెచ్‌ పరిధిలో వర్షపునీటి డ్రైన్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.900 కోట్లను కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిధులనే వాడుతున్నామన్నారు. తొలి విడత పనులు ఇప్పటికే జోరందుకున్నాయన్నారు. ఎస్‌ఎన్‌డీపీ కోసం కేంద్రం చేసిన సాయం శూన్యమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement