Thursday, December 1, 2022

అసోంలో భారీ అగ్నిప్రమాదం, రెండు వంద‌ల‌కు పైగా ఇళ్లు దగ్ధం.. మంట‌ల్లో కాలి బూడిద‌వుతున్న కార్లు, బైకులు

అసోంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్ర‌మాదంలో రెండోంద‌ల‌కు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన కర్బీ అంగ్లాంగ్‌ జిల్లాలో ఇవ్వాల (బుధ‌వారం) జ‌రిగింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. దిమాపూర్‌, బోకజాన్‌ ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పుతున్న‌ట్టు అధికారులు తెలిపారు. అసోం-నాగాలాండ్‌ సరిహద్దులోని కర్బీ అంగ్లాంగ్‌ జిల్లాలోని బోకాజన్‌ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఇక‌.. ఇళ్లలోని గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత ఉధృతం అవుతున్నాయ‌ని, దీంతో బైకులు, కార్లు అక్క‌డిక‌క్క‌డే మంట‌లంటుకుని కాలిపోతున్నాయ‌ని స్థానికులు చెబుతున్నారు. ఇళ్లలోని నగదు, ఆహారవస్తువులు, దుస్తులు, ఇతర విలువైన డాక్యుమెంట్లు మంటల్లో కాలిబూడిదైన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -
   

ప్రమాదంలో ఎంత నష్టం జరిగింద‌నే దానిపై ఇప్పుడే అంచ‌నా వేయ‌లేమ‌ని అధికారులంటున్నారు. ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్నికీలలు సంభవించాయని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇక్క‌డి ఇట్లాంటి అగ్నిప్రమాదాలు జరుగడం సాధారణమైపోయాయి. ఈ ఏడాది జూన్‌ నెలలో జెంగ్ఖా బజార్ ప్రాంతంలో‌, అక్టోబర్‌ నెలలో గోలాఘాట్‌ ప్రాంతంలో కూడా భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement