Sunday, May 19, 2024

Spl Story: పోలీసుల పక్కా ప్రణాళిక.. రాజాసింగ్​ను బుక్​ చేసింది ఇట్లనే!

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​ అంటేనే ఓ కాంట్రవర్సియల్ కేరెక్టర్​​. ముస్లింలకు వ్యతిరేకంగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అయినా రెడీగా ఉండే ఓ ప్రజాప్రతినిధిగా అతని అనుచరులు నమ్ముతారు. ప్రశాంతమైన హైదరాబాద్​లో చిచ్చుపెట్టే వ్యాఖ్యలతో పీడీ యాక్ట్​ కేసు దాకా వెళ్లింది పరిస్థితి. ఇంతకీ రాజాసింగ్​ను పోలీసులు ఎట్లా బుక్​ చేశారన్నది గనుక పరిశీలిస్తే చాలా ఇంట్రెస్టింగ్​ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఆ వివరాలు ఏం ఓ సారి లుక్కేద్దాం రండి..

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

భారత్​ మాతాకీ జై.. జై శ్రీరామ్​.. వంటి నినాదాలు వారి నోటి నుంచి నిత్యం వస్తుంటాయి. ఎక్కడ పది మంది గుమిగూడినా, ఓ సభ జరిగినా ఇట్లాంటి నినాదాలు పెద్ద ఎత్తున చేస్తుంటారు. ఇందులో హైదరాబాద్​ గోషామహల్​ నియోజకవర్గం పాత బస్తీని ఆనుకుని ఉండే ప్రాంతం. ఇట్లాంటి ఏరియాలో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు రాజాసింగ్​. అనుచరులతో హల్​ చల్​ చేసేవాడు. అయితే.. ఈ మధ్య హైదరాబాద్​లోని శిల్పకళా వేదికలో జరిగిన మునావర్​ స్టాండప్​ కామెడీ షో మరో వివాదానికి కారణమయ్యింది.

ఈ షో నిర్వాహకుడు మునావర్​ గతంలో రాముడు, సీతాదేవికి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్​లో షో చేయకుండా అతనిని అడ్డుకుంటామని, అవసరమైతే ఆ షోని ధ్వంసం చేస్తామని రాజాసింగ్​ ముందస్తు హెచ్చరికలు చేశాడు. అయినా ఆ షోకి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి షో సక్సెస్​ చేశారు పోలీసులు. ఈ క్రమంలో కొంతమంది బజరంగ్​దళ్​ కార్యకర్తలు స్పెషల్​ పార్టీ పోలీసుల డ్రెస్​లలో లోపలి వచ్చి అడ్డుకోవడానికి ట్రై చేశారు. అప్రమత్తంగా ఉన్న పోలీసు బలగాలు వారిని అడ్డుకుని బయటికి తరలించాయి.

ఆ తర్వాత రాజాసింగ్​ యూ ట్యూబ్​లో పెట్టిన వీడియోలతో మరింత ఆందోళన తలెత్తింది. దీంతో ముస్లింలు పెద్ద ఎత్తున స్పందించారు. రెండ్రోజులు పాత బస్తీ ఏరియాలో తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తాయి. ఓ దశలో మత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని ఇంటెలిజెన్స్​ వర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన హైదరాబాద్​ సిటీ పోలీసులు సీరియస్​గా తీసుకున్నారు.

- Advertisement -

తొలుత.. మొన్నటి మంగళవారం ఎమ్మెల్యే రాజా సింగ్‌ను జైలుకు పంపాలని హైదరాబాద్ పోలీసులు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఉన్నతాధికారుల బృందం రాజాసింగ్‌పై చర్యలు తీసుకునే అన్ని అవకాశాలను అధ్యయనం చేసింది. ఇప్పటివరకు అతనిపై 101 కేసులు నమోదయ్యాయి. వాటిలో 18 మతపరమైన కేసులున్నట్టు పరిశీలించారు. వీటన్నిపైనా వివరణాత్మక అధ్యయనాల తర్వాత పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరచడాన్ని తప్పనిసరి చేసి, PD యాక్ట్ ను ప్రయోగించే ప్రక్రియపై సీరియస్​గా ఫోకస్​ చేశారు. దాని గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

‘‘చట్టపరమైన అధికారులతో కూడిన ఒక కమిటీ PD యాక్ట్​ ప్రతిపాదన యొక్క వాదనలను వింటుంది. ఏదైనా రాష్ట్రం యొక్క శాంతిభద్రతలకు ముప్పుగా భావించే వ్యక్తులపై దీనిని ప్రేరేపిస్తుంది” అని ఇట్లాంటి పరిస్థితిపై పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మునావర్ ఫరూకీ షోకు వ్యతిరేకంగా రాజా సింగ్ చేసిన మొదటి వ్యాఖ్యల తర్వాత పోలీసులు అతనిని నిశితంగా పరిశీలించడం ప్రారంభించారు. అతని వాక్చాతుర్యం డేంజర్​ లెవల్స్​కి చేరడంతో పోలీసులు అతని మునుపటి కేసులు, కార్యకలాపాలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించడం మొదలెట్టినట్టు తెలుస్తోంది.

ఆగస్ట్ 22న రాజాసింగ్​ ప్రవక్త ముహమ్మద్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వీడియో విడుదలైన తర్వాత ఇక తనను మూసెయ్యడానికి అది సరిపోతుందని పోలీసులు నిర్ణయించారు. హైదరాబాద్‌, తెలంగాణను ‘మత అల్లర్లు లేని రాష్ట్రం’గా నిర్వహించాలనే తపనతో వారు వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. మరుసటి రోజు ఉదయం రాజాసింగ్‌ను అరెస్టు చేశారు. అయితే మంగళవారం కొన్ని అనివార్య కారణాల వల్ల కోర్టు కండిషన్స్​తో కూడి బెయిల్​పై విడుదల చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లిం ప్రజలు రోడ్లపైకి వచ్చి రెండు రోజుల పాటు ఆందోళనలు చేపట్టారు. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తతలకు దారితీశాయి. నిరసన ప్రదర్శనలు, రాళ్లదాడి, దిష్టిబొమ్మల దహనం, మోటారు సైకిళ్ల ర్యాలీలు నిర్వహించారు.

పరిస్థితులు చేయిదాటిపోవడంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అంతర్గత సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు అన్ని ఎంపికలను అన్వేషించారు. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయంగా PD చట్టాన్ని అమలు చేయడాన్ని పరిగణించారు. తొలుత ఎమ్మెల్యే, అతని సహచరులను గందరగోళంలో ఉంచడం పోలీసుల వ్యూహం. గురువారం తన కార్యాలయంలో ఎమ్మెల్యేకు మూడు 41A CrPC నోటీసులు జారీ చేశారు. మంగళ్‌హాట్​, షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లలో ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన మూడు క్రిమినల్ కేసుల గురించి వివరణలు అడిగారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్​తో పాటు అతని అనుచరులు ముందే ఊహించారు. కొన్ని కేసులలో పోలీసులు అరెస్టు చేస్తారని.. సులభంగా బెయిల్ పొందవచ్చని అనుకున్నారు. మహ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మంగళ్‌హాట్​ కేసులో ఎమ్మెల్యే బెయిల్‌పై పోలీసులు హైకోర్టులో అప్పీల్ చేశారు. అప్పటిదాకా పీడీ యాక్ట్‌ ప్రతిపాదనపై ఎమ్మెల్యేకు ఎలాంటి క్లూ లేదు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 100 మంది పోలీసులు అతని ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను చర్లపల్లిలోని సెంట్రల్ జైలుకు మార్చారు. ఇక.. పీడీ యాక్ట్ ను రద్దు చేసి జైలు నుంచి బయటకు తీసుకురావాలని ఎమ్మెల్యే లీగల్ టీమ్ ప్లాన్​ చేస్తోంది. తమ తదుపరి ఎత్తుగడలో భాగంగా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

రాజాసింగ్‌పై 2004 నుండి 101 కేసులు నమోదయ్యాయి. వాటిలో 18 కేసులు ద్వేషపూరిత ప్రసంగం, మతపరమైన అల్లర్లకు సంబంధించినవి ఉన్నాయి.. పీడీ యాక్ట్ ను అమలు చేయడానికి ఆరు నెలల వ్యవధిలో మూడు బలమైన కేసులు సరిపోతాయని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో మహ్మద్ ప్రవక్త, ముస్లిం సమాజం, మునావర్ ఫారూఖీపై వీడియోలో అవమానకరమైన ప్రకటనలు చేస్తూ ఎమ్మెల్యే వీడియోను పోస్ట్ చేయడంతో శుక్రవారం భారీ నిరసనలు, ఆందోళనలు జరుగుతాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరించాయి. అంతేకాకుండా యూట్యూబ్‌లోని శ్రీరామ్ చానెల్‌లో వీడియోను అప్‌లోడ్ చేయడం కూడా పోలీసులు పరిశీలించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement