Thursday, May 16, 2024

రైళ్లలో హోస్టెస్‌ సేవలు.. విమానం తరహాలో ప్రణాళికలు.. రైల్వే శాఖ వినూత్న నిర్ణయం..

న్యూఢిల్లీ : భారతీయ రైల్వే తన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధం అవుతోంది. విమానాల్లో అందించే మాదిరి.. ట్రైన్‌ హోస్టెస్‌లను త్వరలో ఏర్పాటు చేయనుంది. ఐఆర్‌సీటీసీ సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. త్వరలో తమ ప్రీమియం తరగతి రైళ్లలో రైలు హోస్టెస్‌ విధులను ప్రవేశపెట్టొచ్చని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం, సేవ కోసం రైలు హోస్టెస్‌లను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌, గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌, తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌, రాజధాని ఎక్స్‌ప్రెస్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌ వంటి సుదూర ప్రీమియం రైళ్లలో ఈ సేవలను ప్రారంభించే అవకాశం లేదని తెలిపారు. పగటి వేళల్లోనే వీరు సేవలు అందిస్తారు. విమానంలో ఎలా అయితే హోస్టెస్‌లు వ్యవహరిస్తారో.. రైళ్లలోనూ అలాగే ఉంటారు. వీరికి ప్రత్యేకమైన శిక్షణ కూడా అందిస్తారు.

ఎంపిక చేసిన రైళ్లలోనే..
ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు రైల్వే హోస్టెస్‌లు అందిస్తారని వివరించారు. ప్రయాణికులు ఎక్కడానికి, దిగడానికి అలాగే వారి సీట్లకు ఆహారం, పానీయాలను పంపిణీ చేయడానికి సహాయపడుతారని పేర్కొన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం, సేవ కోసం నియమించబడే హోస్టెస్‌లు కేవలం మహిళలే కాదని.. పురుష హోస్టెస్‌లు కూడా ప్రీమియం రైళ్లలో ప్రయాణికులకు సేవలు అందిస్తారని వెల్లడించారు. రైలులోని ఒక కంపార్ట్‌మెంట్‌లో ఒక మహిళ, ఒక పురుషుడిని రైలు హోస్టెస్‌గా నియమించే యోచనలో ఉన్నట్టు అధికారి తెలిపారు. 12 నుంచి 18 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేసే రైళ్లలో మాత్రమే రైలు హోస్టెస్‌లను నియమిస్తామని ఆయన చెప్పారు. ఐఆర్‌సీటీసీ ఈ పథకం చాలా చర్చనీయాంశంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన కొన్ని రైల్స్‌లో మంచి స్పందన కనిపిస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement