Sunday, April 28, 2024

అసదుద్దీన్ పై కాల్పుల కేసులో ఇద్దరు అరెస్టు.. మతోన్మాదుల పనే అంటున్న పోలీసులు

ఏఐఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో దాడికి పాల్పడిని ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను సచిన్, శుభమ్‌గా గుర్తించి 307 (హత్య ప్రయత్నం) కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. శుక్రవారం హాపూర్ కోర్టులో హాజరుపరచగా పోలీసులు వారిని కస్టడీకి కోరనున్నట్లు ఉత్తరప్రదేశ్ ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, కేసుకు సంబంధించిన మరిన్ని  వివరాలను తర్వాత మీడియాకు తెలియజేస్తామన్నారు.

దేశభక్త్ సచిన్ హిందూ ఫేస్ బుక్ పేజీ..

నిందితుడు సచిన్ తన కుటుంబంతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని బాదల్‌పూర్‌లో నివసిస్తున్నాడు. అతను ఎల్‌ఎల్‌ఎమ్ (మాస్టర్ ఆఫ్ లాస్) చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారణ చేస్తున్నట్టు చెప్పారు ఏడీజీ. ఒవైసీపై దాడికి సంబంధించి సచిన్‌పై సెక్షన్ 307 కింద కేసు నమోదు  చేశామన్నారు. ‘దేశ్‌భక్త్ సచిన్ హిందూ’ పేరుతో అతని ఫేస్‌బుక్ పేజీని పరిశీలిస్తే.. అతని పోస్ట్ లలో చాలా వరకు జాతీయవాద భావాలు,  మతోన్మాద భావాలున్నాయని తెలిసిందన్నారు. అంతేకాకుండా 2018 జూన్ 1వ తేదీన అతను అసదుద్దీన్ ఒవైసీకి కత్తిని చూపిస్తూ ఉన్న ఫొటోను పోస్ట్ చేసినట్టు తెలిపారు.

“ప్రధాని మోడీ.. నాకు RDX బాంబు కట్టి పాకిస్తాన్‌లోకి వదిలేయండి.. నేను వారిని సమూలంగా నాశనం చేయడానికి రెడీగా ఉన్నాను. భారతమాత కోసం వీర జవాన్లు చేసిన త్యాగానికి ప్రతిఫలం. దేశభక్త్ సచిన్ హిందూ’’.. అని మరో పోస్టులో రాసినట్టు పోలీసులు తెలిపారు.

అయితే. ఈ అరెస్టు తర్వాత పోలీసులు బాదల్‌పూర్‌లోని సచిన్ కుటుంబాన్ని ఐదు నుండి ఆరు గంటల పాటు ప్రశ్నించారు. తాను 20-25 ప్రైవేట్ కంపెనీలకు కార్మికులను అందజేసే కాంట్రాక్టు పని చేస్తున్నానని, సచిన్ తనకు వ్యాపారంలో సహాయం చేస్తున్నాడని అతని తండ్రి వినోద్ పండిట్ చెప్పారు. కాగా, గురువారం ఉదయం 8 గంటల సమయంలో సచిన్ తాము పనిచేసే కంపెనీలో కాస్త పని ఉందని.. చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడని వినోద్ పండిట్ తెలిపారు. తన కొడుకు రెండు, మూడు రోజులుగా మనస్తాపంతో ఉన్నాడని, దానికి గల కారణాలు మాత్రం తెలియలేదన్నారు.

- Advertisement -

ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేదు..

ఈ కేసులో అరెస్టయిన రెండో వ్యక్తి శుభం సహరాన్‌పూర్‌లోని సంప్లా బేగంపూర్‌లో నివాసం ఉంటున్నాడని, అతని తల్లిదండ్రులు లేరని తెలిపారు పోలీసులు. 10వ తరగతి చదివిన తాను వ్యవసాయానికి సంబంధించిన పనులు చేస్తున్నాడని, అతనికి ఇంతకుముందు ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. అతని సోదరికి పెళ్లి అయ్యింది. ఢిల్లీ సమీపంలో ఎక్కడో నివసిస్తుంది.  శుభం తరచుగా వెళ్లి ఆమె వద్దే ఉంటాడు. ఆ యువకుడు ఎక్కువగా గ్రామానికి దూరంగా ఉంటాడని, ఇక్కడ చాలా అరుదుగా కనిపిస్తాడని సాంప్లా బేగంపూర్‌లోని ఇరుగుపొరుగు వారు చెప్పారు. శుభం ఎక్కువగా ఘజియాబాద్‌లోని మోదీపురంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో ఇద్దరు నిందితులు ఒకరికొకరు సుపరిచితులైనట్లు నిర్ధారించారు. అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై ఇరువురూ మండిపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒవైసీ ప్రసంగాలను వింటూ ఉండేవారు. లోక్‌సభ ఎంపీ ఒక నిర్దిష్ట వర్గానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై సచిన్, శుభం మనస్తాపం చెందారని ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. అయోధ్య ఆలయం, రామజన్మభూమి అంశంపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరట్‌, కిథోర్‌లలో జరిగే బహిరంగ సభల్లో ఒవైసీ పాల్గొంటారని తెలియగానే ఆయనను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఇద్దరి నుంచి కంట్రీ మేడ్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు.  అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం మరో ఇద్దరు వ్యక్తుల పేర్లను వెల్లడించారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement