Saturday, April 27, 2024

Gujarat | అసెంబ్లీ ఎన్నికల్లో సంపన్నులకే చాన్స్.. బీజేపీ అభ్యర్థుల్లో 154 మంది కోటీశ్వరులు!​

గుజరాత్​లో 27 ఏళ్లుగా పాలనలో ఉన్న బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరో 3 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అన్ని రకాల అస్త్రాలను ఉపయోగిస్తోంది. గతానికంటే భిన్నంగా ఈసారి ఎక్కువ మంది సంపన్నులకు టికెట్లు ఇచ్చినట్టు పొలిటికల్​ అనలిస్టులు చెబుతున్నారు. బీజేపీతో పాటు కాంగ్రెస్​ పార్టీ సైతం సంపన్నులకే చాన్స్​ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ఒక్కో అడుగు వేస్తూ పంజాబ్​ని కైవసం చేసుకున్న ఆప్​ కూడా గుజరాత్​లో పాగా వేయాలని భావిస్తోంది. అయితే.. ఈసారి ఏ పార్టీ నుంచి ఎంతమంది సంపన్నులు అభ్యర్థులుగా ఉన్నారనే వివరాలను ఏడీఆర్​ తన నివేదకలో వెల్లడించింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది రోజుల టైమ్​ మాత్రమే ఉంది. దీంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అన్నిరకాలయ ప్రయత్నాలు చేస్తోంది. 27 ఏళ్లుగా కాషాయ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్​ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో సహా పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. కాగా, 182 నియోజకవర్గాలకు గాను రెండు విడతలుగా ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్​ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. డిసెంబర్​ 1వ తేదీన ఫస్ట్​ పేజ్​లో 89 నియోజకవర్గాల్లో, డిసెంబర్​ 5వ తేదీన సెకండ్​ ఫేజ్​లో భాగంగా 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక.. డిసెంబర్​ 8వ తేదీన ఫలితాల వెల్లడి కానుంది.

అయితే.. ఈసారి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీ చేస్తుండడంతో ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్​ అనలిస్టులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాలని AIMIM నిర్ణయించింది. దీంతో ముస్లిం, దళితుల ఓట్లు చీలే అవకాశం ఎక్కువగా ఉంటుందని కేజ్రీవాల్ పార్టీతోపాటు.. కాంగ్రెస్, బీజేపీ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

పొలిటికల్​ అనలిస్టుల విశ్లేషణ ప్రకారం.. AAP చాలా తెలివిగా హిందూత్వ రాజకీయాలను అనుసరిస్తోంది. హిందూ ఓట్లు పోతాయనే భయంతో ముస్లింలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తకుండా తప్పించుకుంటుంది. అయితే AIMIM వారి ఓట్లను రాబట్టుకునేలా ముస్లిం, దళిత సమస్యలను లేవనెత్తుతోంది. ఇక.. ఈ పోరులో ధన బలంలో బీజేపీ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోటీశ్వరుల అభ్యర్థుల సంఖ్య బాగా పెరిగింది. 1,621 మంది అభ్యర్థుల్లో 456 (28 శాతం) మంది కోటీశ్వరులు ప్రస్తుతం పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

అంతేకాకుండా.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సంపన్న అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వడాన్ని బట్టి ఎన్నికల్లో ధనబలం పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని అసోసియేషన్​ ఫర్​ డెమోక్రటిక్​ రిఫార్మ్స్​ (ఏడీఆర్​) నివేదికలో వెల్లడించింది. ప్రధాన పార్టీలలో బీజేపీకి చెందిన 182 మంది అభ్యర్థుల్లో 154 మంది (85 శాతం), కాంగ్రెస్ నుంచి 179 మంది అభ్యర్థుల్లో 142 మంది (79 శాతం), ఆప్ నుంచి 181 మంది అభ్యర్థుల్లో 68 (38 శాతం) మంది తమ ఆస్తుల విలువ కోటీ రూపాయల కంటే ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించారు.

ఇక.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2022లో పోటీ చేసే ఒక్కో అభ్యర్థి ఆస్తుల సగటు రూ. 3.58 కోట్లుగా ఉందని ఏడీఆర్​ తన నివేదకలో వెలువరించింది. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 1,815 మంది అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.2.22 కోట్లుగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ప్రధాన పార్టీలలో 182 మంది బీజేపీ అభ్యర్థులకు ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ.16.56 కోట్లు.. కాగా, 179 మంది కాంగ్రెస్ అభ్యర్థులు రూ.7.99 కోట్లు, 181 మంది ఆప్ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.3.68 కోట్లుగా ఉందని ఏడీఆర్​ తన నివేదికలో వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement