Monday, May 13, 2024

పదో తరగతి విద్యార్ధులకు ఈ ఏడాది కూడా గ్రేడింగ్!

‌తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. దీంతో విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వడంపై ఎస్ఎస్సీ బోర్డు కసరత్తు చేస్తోంది. గత ఏడాది కూడా ఎస్సెస్సీ పరీక్షలను రద్దుచేసి ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ) ఆధారం గా విద్యార్ధులకు గ్రేడింగ్‌ ఇచ్చారు. ఈ ఏడాదీ అలానే ఇవ్వనున్నారు. దీనిపై ఒక వారంలో నిర్ణయం వెలువడనుందని సమాచారం.

ఏటా ఎస్ఎస్సీ విద్యార్థులకు 4 ఎఫ్‌ఏలు నిర్వహించేవారు. 40 రోజులకు మించకుండా బోధించిన పాఠ్యాంశాలకు ఈ పరీక్షలు జరిపేవారు. 4 ఎఫ్‌ఏలకు సంబంధించిన 80 మార్కులను 20 మార్కులకు కుదించి తుది ఫలితాల్లో కలిపేవారు. అయితే, ఈ ఏడాది రెండు ఎఫ్‌ఏలు జరపాలని నిర్ణయం తీసుకున్నా ఒకే ఎఫ్‌ఏ సాధ్యమైంది. ఆ పరీక్ష మార్కుల అప్‌లోడింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. గతేడాది 20 ఎఫ్‌ఏ మార్కులను 100గా పరిగణించి, విద్యార్థి సాధించిన ఎఫ్‌ఏ మార్కులు కలిపి గ్రేడ్లుగా ఇచ్చారు.

కాగా, క‌రోనా ఉధృతి నేప‌థ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగతి తెలిసిందే. ‌మే 17వ తేదీ నుండి జ‌ర‌గాల్సిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ పాఠ‌శాల విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. త్వ‌ర‌లోనే ఎస్ఎస్‌సీ బోర్డు విద్యార్థుల ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నుంది. సీబీఎస్ఈ సైతం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను రద్దు చేసి ప‌న్నెండో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement