Monday, May 6, 2024

తెలంగాణాలో క‌రోనా విల‌య తాండ‌వం – కొవిడ్ సెంట‌ర్ గా గాంధీ హాస్ప‌ట‌ల్

హైదరాబాద్‌, కరోనా వైరస్‌ రాష్ట్రంలో కరాళ నృత్యం చేస్తుండడంతో గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్‌ ఆస్పత్రిగా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇప్పటి వరకు నమోదుకానన్ని అత్యధిక రోజువారీ కేసులు శుక్ర‌వారం నమోదయ్యాయి. ఏకంగా నాలుగువేల‌కు పైగా కేసులు నమోదవడం వైద్యవర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. పలు జిల్లాల కలెక్టర్లు కూడా కరోనా బారిన పడ్డారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత కరోనా బారిన పడ్డారు. మంచిర్యాల ఆర్టీసీ డిపోలో కరోనా కలకలం రేపింది. ఒకేరోజు 12 మంది కార్మికులకు వైరస్‌ సోకింది.ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన ఎంజీఎం ఆస్పత్రిలోని 20 మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. ఇక.. మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తుండడంతో తెలంగాణ సరిహద్దుల వద్ద అప్రకటిత లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రయివేటులో ఇప్పటికే సగంమేర ఆక్సిజన్‌ బెడ్లు నిండిపోయాయి. శరీరంలో ఆక్సిజన్‌ నిల్వలు పడిపోతే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఓ వైపు కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంటే రాష్ట్రంలో వ్యాక్సిన్‌ నిల్వలు అడుగంటిపోయాయి. కేవలం శనివారం ఒక్కరోజుకు సరిపడా టీకా నిల్వలే ఉన్నాయి.

ఒక్క రోజే నాలుగు వేల‌కు పైగా కొత్త కేసులు
తెలంగాణలో క‌రోనా కేసులు రోజురోజుకు అధిక‌మ‌వుతున్నాయి. శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 4,446 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా మ‌రో 12 మంది బాధితులు మ‌ర‌ణించారు. 1,414 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3.46 ల‌క్ష‌ల‌కు చేరింది. ఇందులో 1,809 మంది బాధితులు వైర‌స్‌వ‌ల్ల మ‌ర‌ణించ‌గా మ‌రో 3.11 లక్ష‌ల మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల్లో 33,514 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 22,118 మంది బాధితులు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 598, రంగారెడ్డి జిల్లాలో 326, నిజామాబాద్‌లో 314 చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో శుక్రవారం నాడు 1,26,235 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

ఒకే చోట టెస్టులు, వ్యాక్సినేషన్
రాష్ట్రంలోని చాలా ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్టులు, కరోనా టీకాలు ఒకే ప్రాంగణంలో కొనసాగిస్తుండడంతో అవి వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ఒకే ఆస్పత్రిలో కోవిడ్‌ టెస్టులు, టీకాల కార్యక్రమం కొనసాగిస్తున్నారు. గర్భిణీలు, బాలింతలకు కూడా అదే ప్రాంగణంలో చికిత్సలు అందిస్తున్నారు. దీంతో వైద్య చికిత్సల కోసం ఆస్పత్రికి వచ్చిన బాలింతలు, టీకా లబ్ధిదారులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఆయా ప్రాంగణాలు కోవిడ్‌ బాధితులు, టీకా లబ్ధిదారులతో రద్దీగా మారుతున్నాయి.

మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దుల్లో అప్రకటిత లాక్‌డౌన్‌
మహారాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ జిల్లాలు కరోనా వైరస్‌ తాకిడికి అతలాకుతలం అవుతున్నాయి. సరిహద్దు జిల్లాల్లో పాజిటివిటీ రేటు రోజు రోజుకు పెరుగుతోంది. మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది. దీంతో తెలంగాణ సరిహద్దు జిల్లాలు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌, ఆసీఫాబాద్‌ తదితర జిల్లాల్లో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి నిత్యం వివిధ పనులమీద, కరోనా చికిత్స కోసం పెద్ద సంఖ్యలో నిత్యం జనం తెలంగాణ జిల్లాలకు వస్తున్నారు. సరిహద్దు జిల్లా ఆస్పత్రులు కోవిడ్‌ పాజిటివ్‌లతో కిటకిట లాడుతున్నాయి. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల వద్ద అప్రకటిత లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. సరిహద్దులను మూసివేశారు. ప్రజలు గుంపులు గుంపులుగా సంచరించొద్దని, కనీసం ఇద్దరు, ముగ్గురు కూడా ఒకచోట ఉండొద్దని, మాస్కులు ధరించాలని ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా కందకుర్తి చెక్‌పోస్టు దగ్గర ప్రత్యేక వైద్య శిబిరాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజుకు 700కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ కరోనా అలజడి సృష్టిస్తోంది. గురువారం ఒక్కరోజే 2వేలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలోని భీమ్‌గల్‌లో ఒక్క రోజులోనే 70మంది కరోనా బారిన పడడంతో గ్రామ పెద్దలు సమావేశమై లాక్‌డౌన్‌ విదించారు. ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకే షాపులు తెరవాలని తీర్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement