Saturday, May 4, 2024

కేంద్రం ధరలు పెంచే ప్రభుత్వం-పేదల ఉసురు పోసుకుంటోంది-మంత్రి హ‌రీష్ రావు

మెదక్ బ్యూరో, ( ప్రభ న్యూస్): తెలంగాణకు ఏం సాధించి పెట్టారని బిజెపొళ్ళు పాదయాత్రలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా అందోల్ నియోజక వర్గం టేక్మాల్ మండలంలోని హసన్ మొహమ్మద్ పల్లిలో 56 మంది దళిత బందు లబ్ధిదారులకు వరికోత యంత్రం, ట్రాక్టర్లు, వాణిజ్య వాహనాలు, టెంట్ సామాగ్రి, మినీ డైరీ యూనిట్లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతుంటే వడ్ల రాజకీయం చేస్తున్నారని, తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి అన్నదాతల గోసను అర్థం చేసుకుని కొనుగోళ్లు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. బిజెపి- కాంగ్రెస్ దొందు- దొందేనని విమర్శించారు. బిజెపి – కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమం ఆటకెక్కిందని ఆరోపించారు. దేశంలో పేదరికం పెరగడానికి వీరే కారణమన్నారు.
కేంద్రం ధరలు పెంచే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం కోసం పాటు పడుతుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ధరాఘాతంతో సామాన్యుడి నడ్డి విరిస్తుందని ఆరోపించారు. యుద్ధం పేరుతో ఇంధన ధరలు పెంచిదని, గ్యాస్ ధరలు సైతం పెంచి సామాన్యుడు కోలుకుని పరిస్థితికి తీసుకువ‌చ్చింద‌న్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ అన్ని వర్గాలను విచిన్నం చేసిందన్నారు. దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న బిసి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గానే చూసింది. తప్ప ఏనాడు వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పాటు పడలేదని దమ్ముంటే బిజెపి- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళిత బందును అమలు చేయాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో ఎంపీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement