Monday, April 29, 2024

ఎంపీ సుమలతపై నోరు జారిన మాజీ సీఎం

ప్రముఖ నటి, మండ్య ఎంపీ సుమలతపై కర్ణాటక మాజీ సీఎం  కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కావేరి నదిపై కృష్ణరాజ సాగర్‌ (కేఆర్‌ఎస్‌) జలాశయం నుంచి నీరు లీకవుతుంటే, అడ్డుగా ఎంపీ సుమలతను పడుకోబెట్టాలంటూ కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మైసూరు చక్కెర కర్మాగారం అంశంపై జేడీ (ఎస్) ఎమ్మెల్యేలతో వెళ్లి ముఖ్యమంత్రి యడియూరప్పను కలిసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కేఆర్‌ఎస్‌ ప్రాజెక్టు నుంచి నీరు లీకవుతోందని సుమలత తరచూ ఆరోపిస్తున్నారని అన్నారు. జలాశయం రక్షణను ఆమె పర్యవేక్షిస్తున్నట్లుగా ఉందని మాజీ సీఎం ఎద్దేవా చేశారు. లీకేజీలు నిలిచిపోవాలంటే స్లూయజ్ గేట్లకు అడ్డుగా సుమలతను పడుకోబెట్టాలని నోరుజారారు.

‘కేఆర్‌ఎస్ డ్యామ్‌ను ఆమె ఒక్కరే రక్షించే విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ లీకేజ్ ఉంటే.. లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెట్టాలి. సుమలత లాంటి ఎంపీని మాండ్యా ఎప్పుడూ చూసి ఉండదు.. భవిష్యత్తులో ఆమె లాంటి వారు.. ఆమె సానుభూతితో గెలిచారు.. ఆమెకు మరో అవకాశం రాదు కాబట్టి ఆమె సరిగ్గా పనిచేస్తే మంచిది’ అని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

కుమారస్వామి వ్యాఖ్యలపై సుమలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎంకి ఒక మహిళ గురించి ఎలా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదని మండిపడ్డారు. వ్యక్తిత్వం, సంస్కృతి లేకుండా మాట్లాడారని దుయ్యబట్టారు. విమర్శలు చేయడంలో తప్పులేదు కానీ, మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో ఉంచుకోవాలని ఆమె సూచించారు. ఆ స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని పేర్కొన్నారు. కేఆర్‌ఎస్‌పై తాను చేసిన వ్యాఖ్యలను సుమలత సమర్ధించుకున్నారు. విపత్తు నిర్వహణ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా ఇదే రకమైన ఆందోళనలను వ్యక్తం చేసిందని చెప్పారు. కేంద్ర జల శక్తి మంత్రితో, పార్లమెంట్‌లో తాను ఈ విషయాన్ని లేవనెత్తానని చెప్పారు. కేఆర్‌ఎస్‌ ప్రాజెక్టు సమీపంలో అక్రమ మైనింగ్ వల్ల సమస్య ఏర్పడుతోందని, లీకేజీ జరిగే చోట ఆయననే పడుకోబెడితే సరిపోతుందని కౌంటర్ ఇచ్చారు.

కాగా, మాండ్య నుంచి 2019 ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సుమలత.. కుమారస్వామి తనయుడు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ గౌడపై విజయం సాధించిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇది కూడా చదవండి: వైఎస్ షర్మిల పార్టీ జెండా రెడీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement