Saturday, April 27, 2024

Drugs Effect: ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌, బార్ లైసెన్స్ ర‌ద్దు

హైద‌రాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిస‌న్ బ్లూ ప్లాజా హోట‌ల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌లో డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న ఘ‌ట‌న‌పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియ‌స్‌గా స్పందించారు. అయితే ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్ యాజ‌మాన్యం ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ శాఖ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన నేప‌థ్యంలో ప‌బ్, బార్ లైసెన్స్‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్.. సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేర‌కు ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌, బార్ లైసెన్స్‌ను ర‌ద్దు చేస్తూ అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఉన్న పబ్ యజమానులతో ఈ ఏడాది జ‌న‌వ‌రి 31న‌ హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజా హోటల్‌లో సమన్వయ సమావేశం నిర్వహించామని మంత్రి గుర్తు చేశారు. పబ్‌ల‌లో డ్రగ్స్ వినియోగం జరగకుండా పబ్ యజమానులే బాధ్యత వహించాలని గత సమావేశంలోనే మంత్రి హెచ్చ‌రించారు. డ్రగ్స్ వినియోగంపై పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. నిబందనలు పాటించని పబ్ ఓనర్లు ఎంతటివారైన ఉపేక్షించేది లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిన్నటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు.

డ్ర‌గ్స్ నిర్మూల‌న‌లో భాగంగానే దాడులు
డ్రగ్స్ నిర్మూల‌న‌లో భాగంగానే రాడిస‌న్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశార‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నిబంధనలు పాటించని అన్ని ప‌బ్‌లు, బార్‌ల‌పై నిరంతరం దాడులను కంటిన్యూ చేస్తామని తేల్చిచెప్పారు. డ్రగ్స్ రాకెట్‌కు సంబంధం ఉన్న ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. కఠినంగా శిక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అందులో భాగంగా డ్ర‌గ్స్‌తో సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు డ్ర‌గ్స్‌పై ఉక్కుపాదం మోపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆబ్కారీ శాఖ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ కంటిన్యూగా పబ్, బార్లపై నిఘా పెట్టి ఎవరైతే నిబంధనలు పాటించకుండా నిర్వ‌హిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement