Friday, May 3, 2024

ఇకపై ఐదంచెల వైద్య సేవల విధానం.. సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మక ప్రణాళిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వైద్య సేవల విస్తరణ దిశగా తెలంగాణ సర్కార్‌ కీలక ముందడుగేసింది. వైద్య సేవలు నగరాలకు, మరీ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కావడం, పట్టణ జనాభా విపరీతంగా పెరగడంతో హైదరాబాద్‌లో ఉన్న ఆస్పత్రులలో సేవలు సరిపోవడం లేదని గుర్తించిన ప్రభుత్వం వికేంద్రీకరణ దిశగా దృష్టి సారించింది. సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు హైదరాబాద్‌ చుట్టూ మల్టిd సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల కల్పనకు నడుం బిగించింది. వ్యాధులను త్వరితగతిన గుర్తించి ప్రివెంటివ్‌ చికిత్స కోసం, సూపర్‌ స్పెషాలిటీ వైద్యం కోసం ఇప్పటి వరకు తెలంగాణలో ప్రభుత్వ వ్యవస్థ లేకపోవడాన్ని లోటుగా గుర్తించి దిద్దుబాటుకు ప్రాధాన్యతనిచ్చింది. వైద్య సేవల్లో విప్లవాత్మక నిర్ణయంతో ఇప్పటికే కొనసాగుతూ వచ్చిన మూడంచెల సేవలను ఐదంచెల వ్యవస్థగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో మూడంచెల వైద్య సేవల విధానం అమలులో ఉంది. ఈ క్రమంలో మండల స్థాయిలో ప్రాథమిక సేవలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ద్వితీయ స్థాయి సేవల్లో భాగంగా జిల్లా ఆస్పత్రులు, స్పెషాలిటీ సేవల్లో భాగంగా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. వీటిద్వారా రాష్ట్రంలోని ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందుతున్నాయి.
ఇకపై వీటికి అనుసంధానంగా, అదనపు వసతులతో కొత్తగా ప్రభుత్వం మరో రెండంచెల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో ప్రివెంటివ్‌ వైద్య సేవల్లో భాగంగా బస్తీ, పల్లె దవాఖానాలు, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవల అందజేతకు టిమ్స్‌లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలన్న ఆయన ఆకాంక్ష మేరకు భారీగా నిధులు కేటాయించి, అందుకు అనువుగా స్థల సేకరణ జరిపారు. ఇకపై రాష్ట్రంలో ఐదంచెల ప్రభుత్వ వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. ఇందులో భాగంగా వైద్య సేవల కల్పనకు సీఎం కేసీఆర్‌ మంగళవారం శంకుస్థాపనలు చేశారు.

వైద్య విద్య విస్తరణ…
దేశవ్యాప్తంగా ఉన్న యూజీ, పీజీ సీట్ల కొరత, ప్రత్యేకంగా ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా వైద్య విద్యపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో రాష్ట్ర విద్యార్థులకు మేలు చేసేలా ప్రభుత్వం వైద్య విద్య విస్తరణ కార్యక్రమాన్ని దశలవారీగా చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐదు మెడికల్‌ కాలేజీలు ఉండగా, 17కు పెంచేందుకు కార్యాచరణ ముమ్మరం చేసింది. తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం రాష్ట్రంలో కేవలం 5 మెడికల్‌ కాలేజీలు ఉండగా, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్తగా నాలుగు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి. 2021లో మరో 8 మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం మంజూరీ చేసింది. 2022-23లో 8 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ తర్వాత ఏడాది 2023-24లో మరో 8 మెడికల్‌ కాలేజీల స్థాపనకు దశల వారీగా కార్యక్రమాన్ని రూపొందించుకుంది.

యూజీ సీట్ల పెంపు…
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న యూజీ సీట్ల పెంపుతో వైద్య ఉన్నత విద్యకు మరింత మెరుగైన పరిస్థితులు నెలకొల్పాలని సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారు. 2014లో రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రాష్ట్రంలో 700 యూజీ సీట్లు ఉండగా, 2021లో 1640కి పెరిగాయి. ఈ ఏడాదిలో 8 కాలేజీలలో 1200 సీట్లు కొత్తగా అనుమతి రావడంతో ఈ సంఖ్య 2840కి పెరగనుంది. 2023-24లో జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటైన అనంతరం ప్రభుత్వ పరిధిలో మెడికల్‌ సీట్లు 5240 అందుబాటులోకి రానున్నాయి.

పీజీ సీట్ల పెంపు…
రాష్ట్రంలో మెడికల్‌ పీజీ సీట్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో 531 సీట్లు ఉండగా, 2021నాటికి 967 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా సూపర్‌ స్పెషాలిటీ సీట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంది. ఈ సంఖ్య 2014లో 82కాగా, 2021నాటికి 153కు పెరిగింది. పీజీ, సూపర్‌ స్పెషాలిటీ సీట్లకు ప్రభుత్వం విశేష కార్యాచరణ మొదలు పెట్టింది. 4 కొత్త టిమ్స్‌లను, వరంగల్‌ హెల్త్‌ సిటీని, నిమ్స్‌ను విస్తరించడం, మెడికల్‌ కాలేజీలో పీజీ సీట్ల సంఖ్య పెంపుపై ప్రణాళిక నిర్ధేశించుకున్నది. 2023-24వరకు ప్రభుత్వ రంగంలో మెడికల్‌ సీట్ల లక్ష్యాన్ని కూడా భారీగా విస్తరించేలా వ్యూహం ఖరారు చేసింది. ఇందులో భాగంగా యూజీ సీట్లు 5240, పీజీలో 2500సీట్లు, సూపర్‌ స్పెషాలిటీలో 1000 సీట్లను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement