Monday, May 6, 2024

తెలంగాణలో అన్నదాత… అరిగోస…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రికార్డుస్థాయి ధాన్యం ఉత్పత్తి సాధించిన తెలంగాణాలో సంబరం అటుంచి.. అన్నదాతలు పుట్టెడు కష్టాల్లో పడ్డారు. చరిత్రలో ఇదివరకు ఎన్నడూ లేనివిధం గా రాష్ట్రంలో యాసంగి వరిసాగు 62 లక్షల ఎకరాలు దాటింది. అదే స్థాయిలో.. అధికారుల అంచనా ప్రకారం ధాన్యోత్పత్తి కోటి 58 లక్షల మెట్రిక్‌ టన్నులు దాటనుంది. రైతుల వక్తికి మించి సాగైన పంట, అంచనాకు మించి వచ్చిన దిగుబడి.. అదే సమయంలో ఊహించని విధంగా వెంటాడుతున్న అకాల వర్షాలు వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఇదివరకు తెలం గాణా యాసంగి ఉత్పత్తి సామర్థ్యం ఎన్నడూ కోటి 30 లక్షలు దాటి లేకపోవడంతో ప్రభుత్వ అంచనాలు కూడా అదేస్థాయిలో ఉండేవి. ప్రతియేటా సరాసరిగా (మొదటిపేజీ తరువాయి)
70 నుంచి 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వరంగ సంస్థల ద్వారా కొనుగోలు చేసేవారు. కానీ ఈసారి పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఏకకాలంలో కోటిన్నర లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చిపడుతుండడంతో కొనుగోళ్ళ ప్రక్రియ ఆ స్థాయికి విస్తరించడం కష్టతరంగా మారింది.

గత పక్షం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, విస్తరన ముందుకు కదలడం లేదు. పైగా తడిసిన ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో ఆరబెట్టడం రైతులకు గగనతరంగా మారుతోంది. భారత ఆహార సంస్థ నిబంధనల ప్రకారం 15శాతం మించిన తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అనుమతి లేదు. పూర్తిగా తడిసిన ధాన్యం 50శాతానికి మించిన తేమతో కూడి ఉంటుంది. ఆరబెట్టే సమయంలో 5 రోజులు దాటితే ధాన్యం మొతకెత్తుతుంది. ఏ కోణంలో చూసినా తడిసిన ధాన్యం కొనుగోళ్ళు ఇప్పటికిప్పుడు ప్రారంభయమయ్యే అవకాశాలు లేవు. ఇదిలా ఉండగా, కోత దశకు వచ్చిన వరి పొలాలు పరిచిన చాపగా పడుకున్నాయి. దీంతో యంత్రాలతో కోతలు మొదలుపెట్టే అవకాశం లేకుండా పోయింది. ఊహించని విధంగా దంచికొడుతున్న చెడగొట్టు వానలతో వరి పంట నీటమునిగి తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. ధాన్యం మొలకలు వస్తుంటే తేమ పేరుతో అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ అన్నదాతలు ఆరోపిస్తున్నారు. పలు చోట్ల ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. తడిసిన ధాన్యాన్ని చూసి.. కామారెడ్డి జిల్లాలో మనస్తాపానికి గురై.. ఓ రైతు గుండె ఆగిపోయింది. ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం.. తమవంతు బాధ్యతగా అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటామంటూ రైతుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

గత్యంతరం లేకే ఆందోళనలు
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాత అరిగోస పడుతున్నాడు. యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై అధికారులు నెలన్నర రోజుల కిందటే ప్రణాళికలు రూపొందించుకుని సిద్ధంగా ఉన్నా.. పంటను వెనువెంటనే కొనుగోలు ప్రక్రియ చెపట్టలేదు. మెదక్‌ జిల్లాలో ధాన్యం మొలకలు వచ్చి లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు రైతులు తడిసిన ధాన్యాన్ని ఎండకు ఆరబెట్టి కుప్పలు పోయక ముందే… అకాల వర్షం వల్ల ధాన్యం తడిసిపోయింది. కుప్పలుగా పోసిన ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులకు భరోసా ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో కొనుగోలు చేయట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రైతులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై ఆందోళనకు దిగారు. అకాల వర్షానికి తరచూ ధాన్యం తడిసిపోవడంతో మొలకలు వస్తున్నాయని.. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగం పెంచి.. కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అధిక నష్టం
కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. సుమారు 5 లక్షల క్వింటాళ్ల ధాన్యం తడిచినట్లు- అధికారులు అంచనా వేశారు. వీణవంక మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పరిశీలించారు. హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లికి చెందిన రాములు, అయిలయ్య అనే రైతులు కోసిన ధాన్యం.. చెరువుపాలైంది. గ్రామ శివారులోని రాజన్న ఆలయం వద్ద ఉన్న బండపై ఆరబోసిన ధాన్యం… అకాల వర్షానికి రాజన్న చెరువులోకి కొట్టు-కుపోయింది. నోట మాట కూడా రాలేదని దుస్థితిలో ఉన్న రాములు పరిస్థితిని చూసి.. తోటి రైతులు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అతన్ని ఆదుకోవాలని వేడుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని కేశాపూర్‌, డిచ్‌పల్లి మండలంలోని బర్దిపూర్‌ గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పరిశీలించారు. ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని… ధాన్యం కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. నిర్మల్‌ జిల్లాలో పర్యటించిన ఆయన రైతులకు భరోసా కల్పించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడానికి వెనుకాడడంతో కేసీఆర్‌ ముందుకు వచ్చారని ఆయన వెల్లడించారు. తేమ శాతం పేరుతో అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యం చేయవద్దంటూ అన్నదాతలు వేడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement