Sunday, May 5, 2024

గంజాయ్ పండించిన రైతు.. రైతు బంధు కట్

కొందరు వ్యవసాయం పేరుతో గంజాయి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేయొద్దని ప్రభుత్వాలు ఎంత చెప్పినా చెవిన పెట్టకుండా గంజాయిని పండిస్తున్నారు. పంట పొలంలో గంజాయి సాగు చేసిన ఓ రైతుకు అధికారులు గట్టి షాక్ ఇచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు. ఆ రైతు పేరును రైతుబంధు పథకం అర్హుల లిస్ట్ నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌ నగర్‌ రూరల్‌ మండలం మణికొండ ప్రాంతంలో చంద్రయ్య అనే రైతు గంజాయి సాగు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో అబ్కారీ, రెవెన్యూశాఖ అధికారులు ఆ రైతుకు సంబంధించిన పొలంలో తనిఖీలు చేశారు. రైతు గంజాయి పండిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రైతుబంధు కింద వచ్చే 7500 రూపాయలను ఆ రైతుకు అందించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు చంద్రయ్యను అర్హుల జాబితా నుంచి తొలగించారు.

వచ్చే పంటకాలంలో నుండి ఇది అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో ఏ రైతు గంజాయి సాగు చేస్తున్నట్టు రుజువైనా.. ఆ సమాచారం గ్రామస్తులు సంబంధిత అధికారులకు అందించకపోయినా.. ఆ గ్రామానికి రైతు బంధుతోపాటు తదితర సబ్సిడీలు రద్దు చేస్తామని కూడా హెచ్చరికలు పంపారు. 5 సార్లకు మించి గంజాయి దొరికితే ఆ ఊరికి ప్రభుత్వం నుండి అందే అన్ని రకాల సబ్సిడీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా గ్రామస్తుల మీద కూడా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తరుచూ డ్రగ్స్ రవాణాలు బయటపడుతూనే ఉన్నాయి. రవాణా చేస్తున్న ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు అది గ్రామాలకు పాకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement