Thursday, May 16, 2024

శ్రీరామ నవమి శోభాయాత్రకు అంతా రెడీ.. 9 వేల మంది పోలీసులతో బందోబస్తు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శ్రీరామనవమి శోభాయాత్రకు తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ సిద్ధ‌మ‌య్యింది. యాత్ర జరిగే మార్గాలు, ప్రాంతాలలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. కరోనా కారణంగా గడచిన రెండేళ్ళుగా శోభాయాత్రను నిర్వహించక పోవడంతో ఈ దఫా యాత్రను హంగూ, ఆర్భాటంతో నిర్వహించేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో జరిగే శోభాయాత్రకు గడచిన వారం రోజులుగా పోలీసులు ముమ్మర కసరత్తును చేస్తున్నారు. బందోబస్తు కోసం దాదాపు తొమ్మిది వేల మంది పోలీసులను వినియోగిస్తున్న అధికారులు చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో పసిగట్టేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు సీతారాంబాగ్‌ దేవాలయం నుంచి ప్రారంభమయ్యే యాత్ర సాయంత్రం సుల్తాన్‌బజార్‌ హనుమాన్‌ వ్యాయామశాలలో జరిగే సభతో ముగియనుంది.

ఈ యాత్రకు హైదరాబాద్‌ నగరంతో పాటు పరిసర ప్రాంతాలలోని జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున యువకులు పాల్గొనే అవకాశం ఉన్నందున భారీగా పోలీసులను మోహరింప చేస్తున్నారు. యాత్ర జరిగే ప్రాంతాలను పోలీసులు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుని కీలక ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఊరేగింపు పర్యవేక్షణ కోసం పలువురు డీసీపీలకు బాద్యతలను అప్పగించారు. గతంలో జరిగే కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఈ దఫా ఎక్కడా ఎలాంటి చిన్న సంఘటన కూడా చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సీతారాంబాగ్‌ దేవాలయం నుంచి మొదలయ్యే శోభాయాత్ర బోయిగూడ కమాన్‌, మంగళ్‌హాట్‌, జాలి హనుమాన్‌, ధూళ్‌పేట్‌, పురానాపూల్‌ గాంధీ విగ్రహం, జుమ్మేరాత్‌బజార్‌, చుడీబజార్‌, బేగంబజార్‌ ఛత్రీ, బర్తన్‌బజార్‌, సిద్ధిఅంబర్‌బజార్‌, శంకర్‌షేర్‌ హోటల్‌, గౌలిగూడ చమన్‌, గౌలిగూడ రాంమందిర్‌, పుత్లిdబౌలీ, కోఠి ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తాల మీదుగా హనుమాన్‌ వ్యాయమశాల చేరుకోనుంది. ఊరేగింపు జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా అంబర్‌పేట ప్లే గ్రౌండ్‌, అంబర్‌పేట, ఛే నంబర్‌ చౌరస్తా, తిలక్‌నగర్‌, ఫివర్‌ ఆస్పత్రి, బర్కత్‌పుర, కాచిగూడ, టూరిస్ట్‌ హోటల్‌, ఛాదర్‌ఘాట్‌ల మీదుగా హనుమాన్‌ వ్యాయామశాలకు మరొ ఊరేగింపు జరుగనుంది.

అలాగే నారాయణగూడలోని జీఎస్‌ మెల్కోటే పార్క్‌, నారాయణగూడ చౌరస్తా, కాచిగూడ చౌరస్తా, బడీచౌడీ, సుల్తాన్‌బజార్‌ల మీదుగా హనుమాన్‌ వ్యాయామశాలకు ణరో ఊరేగింపు చేరుకోనుంది. ఖైరతాబాద్‌ గ్రంధాలయం మొదలయ్యే మరో ఊరేగింపు హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌ చౌరస్తాల మీదుగా హనుమాన్‌ వ్యాయామశాలకు చేరుతుంది. సికింద్రాబాద్‌, మెహిదీపట్టణం తదితర ప్రాంతాల నుంచి కూడా వేర్వేరుగా ఊరేగింపులు జరుగనున్నందున పోలీసులు ఎక్కడికక్కడ ఏర్పాట్లను చేశారు.
శోభాయాత్రకు స్వాగతం పలికేందుకు పలు చోట్ల ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని వేదికలపై నుంచి సాధు సంతులు ధర్మసందేశాలను ఇవ్వనున్నారు. యాత్రలో పాల్గొనేవారి సౌకర్యార్థం స్వచ్చంద సంస్థలు, ధార్మిక సంస్థలు అల్పాహారం పంపిణీ, బిస్కెట్ల పంపిణీ, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను చేపడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌ అధికారులు కొన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. వాటరవర్క్స్‌ అధికారులు దాదాపు అయిదు లక్షల వాటర్‌ ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు వేర్వేరు ప్రాంతాలలో ఏర్పాట్లను చేశారు.

సంఘ విద్రోహకరశక్తులపై ప్రత్యేక నిఘా
శోభాయాత్రతో పాటు ఊరేగింపుగా వచ్చిన వారంతా తిరిగి సురక్షితంగా వెళ్ళేంత వరకూ నగరంలోని ప్రధాన కూడళ్ళు, కీలక ప్రాంతాలలో నిఘాను తీవ్రం చేయాలని నిర్ణయించారు. సమస్యాత్మక ప్రాంతాలలో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించుతున్నారు. కీలకమైన ప్రాంతాలలో సాయుధ పోలీసులతో బందోబస్తుకు ఏర్పాట్లు చేశారు. సిసి కెమెరాల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు మొబైల్‌ సీసీ కెమెరాల వ్యాన్‌లను కూడా కూడళ్ళలో సిద్దంగా ఉంచాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement