Monday, April 29, 2024

పోలీసుల మార్గదర్శకాల మేరకు శోభాయాత్ర – స్పష్టం చేసిన హైకోర్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పోలీసుల మార్గదర్శకాల మేరకు హైదరాబాద్‌, భైంసాలలో శ్రీరామనవమి శోభాయాత్రను నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. భైంసాలో శోభాయాత్రకు నిర్ణీత ప్రదేశాలలోనే అనుమతించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. భైంసాలో శోభాయాత్రను ఏ ప్రాంతాలలో నిర్వహించాలనేది పోలీసులు నిర్ధేశించాలని, ఆ ప్రాంతంలోనే జరపాలని పేర్కొంది. ఉదయం 9గం. నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శోభాయాత్ర జరపాలని పేర్కొంది. హైదరాబాద్‌లో శోభాయాత్రకు అనుమతించిన హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ (శాంతి భద్రతలు) పేర్కొన్న మార్గదర్శకాలను భైంసాలో అనుసరించాలని కోర్టు సూచించింది. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రాంతాలు, వీధుల్లో శోభాయాత్రకు అనుమతించినట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వాదనలను విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌లో సీతారాంబాగ్‌ ఆలయం నుంచి సుల్తాన్‌బజార్‌ హనుమాన్‌ వ్యాయామశాల వరకు శోభాయాత్ర నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. బోయిగూడ కమాన్‌, మంగళ్‌హాట్‌ పోలీసుస్టేషన్‌ రోడ్‌, ధూళ్‌పేట, పురానాపూల్‌, జుమ్మేరాత్‌బజార్‌, సిద్ధిఅంబర్‌బజార్‌, చుడీబజార్‌, బేగంబజార్‌ ఛత్రీ, శంకర్‌షేర్‌ హోటల్‌, గౌలిగూడ చమన్‌, గురుద్వారా, పుత్లిdబౌలీ మీదుగా సుల్తాన్‌బజార్‌ చేరుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. భైంసాలో గోపాలదాస్‌ హనుమాన్‌ ఆలయం, పాత సోనా ఛాందిని, కుబేర్‌ అడ్డా, బస్టాండ్‌, నిర్మల్‌ చౌరస్తా, రాంలీలా మైదాన్‌ మీదుగా ఊరేగింపు నిర్వహించుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement