Monday, May 6, 2024

ఎవ్వ‌రి భాష‌ల‌ వాళ్లు మాట్లాడుత‌రు.. అంద‌రినీ హిందీలో మాట్లాడ‌మంటే ఎట్లా? అమిత్‌షాకు కేటీఆర్ కౌంట‌ర్

కేంద్రంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోసారి మండిప‌డ్డారు. వివిధ రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లు మాట్లాడుకునేట‌ప్పుడు ఇంగ్లిష్, స్థానిక భాష‌ల్లోనే కాకుండా, త‌ప్ప‌కుండా హిందీలోనే మాట్లాడాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను కేటీఆర్ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఘాటుగా స్పందించారు. భార‌త‌దేశం ఒక వ‌సుదైక కుటుంబమ‌ని పేర్కొన్న కేటీఆర్.. భిన్న‌త్వంలో ఏక‌త్వ‌మే మ‌న బ‌లం అని పేర్కొన్నారు. మ‌న దేశంలోని ప్ర‌జ‌లు ఏం తినాలో, ఏం ధ‌రించాలో, ఎవ‌రిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో ప్ర‌జ‌ల నిర్ణ‌యానికే వ‌దిలేయాలి. దేశంలో ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ‍్వకూడదంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్రశ్నించారు. భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్‌ అవుతాయ‌ని కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

నేను మొద‌ట భార‌తీయుడిని.. ఆ త‌ర్వాతే గ‌ర్విచంద‌గ్గ‌ తెలుగువాడిని, తెలంగాణ‌వాడిని అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. నా మాతృభాష తెలుగులో నేను మాట్లాడ‌గ‌ల‌ను. అయిన‌ప్ప‌టికీ ఇంగ్లిష్, హిందీతో పాటు కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడ‌గ‌ల‌న‌ని కేటీఆర్ తెలిపారు. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లిష్‌ భాషను నిషేధించడం వంటి ప్ర‌తిపాద‌న‌లు యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement