Monday, May 6, 2024

ప‌త్తి రైతుపై సిండికేట్ క‌త్తి..

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: అంతర్జాతీయ మార్కెట్‌ లో పత్తికి మంచి డిమాండ్‌ ఉన్నది. దేశీయ మార్కెట్‌లలో వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. పత్తి సీజన్‌ ప్రారంభం కాకముందే దేశంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో క్వింటా పత్తికి 12 వేల రూపాయల గరిష్ట ధర పలికింది. ఒకానొకదశలో 15 వేల మార్క్‌ చేరుకుంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. సీజన్‌ ప్రారంభమై కొత్తపత్తి మార్కెట్‌కు వస్తుండటంతో క్రమంగా ధర తగ్గుతూ వచ్చింది. ఈ సీజన్‌ అక్టోబర్‌లో క్వింటా రూ.10 వేల వరకు మద్దతు ధర పలికింది. పత్తి రైతులు మార్కెట్‌లో రూ.10 వేల ధర స్థిరీకరించబడి ఉంటుందని ఆశపడ్డారు. మార్కెట్‌కు కొత్త దిగుబడులు పెరుగుతున్న కొద్దీ రేటు క్రమంగా పడిపోతూ వస్తుండటం పత్తి రైతులను ఆందోళనకు గురిచేసింది. నవంబర్‌, డిసెంబర్‌కు వచ్చేసరికి 10 వేల నుంచి 8 వేలకు పడిపోయింది. 2023 ప్రారంభంలో కూడా క్వింటాకు రూ.8 వేల వరకు పలికిన పత్తి ధర ఫిబ్రవరి రెండవారం వచ్చేసరికి క్వింటాకు రూ.7,350 ధర మాత్రమే పలకడంతో దూది రైతులు దు:ఖిస్తున్నారు.

సిండికేట్‌ మాయజాలం
వరంగల్‌ ఏనుమాముుల మార్కెట్‌లో పత్తి వ్యాపారులు సిండికేట్‌గా మారారు. సీజన్‌ ప్రారంభంలో పత్తి తేమ, కచ్చా, గుడ్డి పత్తి వచ్చినప్పుడు క్వింటాకు రూ.8 వేలకు పైగా ధర పెట్టిన వ్యాపారులు తేమ శాతం తగ్గిపోయి పూర్తిగా నాణ్యమైన పత్తి మార్కెట్‌లోకి వస్తున్న తరుణంలోనే రోజురోజుకు ధర పడిపోవడం జరుగుతోంది. గత నెల రోజుల నుంచి రోజుకు 100, 50 అన్నట్లుగా ప్రతిరోజు ధర తగ్గుతూ రూ.8 వేలకు పైగా ఉన్న ధర రూ.7,350లకు పడిపోయింది. ఇక వ్యాపారస్తులు ఈ ధర కూడా నిలబడదని, ఇంకా తగ్గే ప్రమాదం ఉందని చెప్పడం చూస్తుంటే ముందుగానే వ్యాపారులంతా సిండికేట్‌గా మారి మార్కెట్‌ను శాసిస్తున్నారనే అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా మార్కెట్‌లో ధరల వేలం పాట అంటే ఒక రైతు తీసుకొచ్చిన పత్తి లాట్‌ వద్దకు ఐదారుగురు వ్యాపారులు వచ్చి పాట పాడతారు. మార్కెట్‌ అధికారులు ముందు రోజు పలికిన గరిష్ట ధరను ఆ రోజు మార్కెట్‌ పాట ధరగా ప్రకటి స్తే దాన్ని ఆధారం చేసుకొని వ్యాపారులు పాటపాడాల్సి ఉంటుంది. కానీ వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో ఈ విధానాలకు స్వస్థి పలికారు. పోటీ పడి పాటపాడే విధానం లేకపోవడంతో రైతులకు తీవ్రనష్టం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. రైతులు తమ వ్యవసాయ పెట్టుబడుల కోసం ఏ అడ్తిదారి దగ్గరైతే అప్పుగా డబ్బులు తీసుకుంటారో.. ఆ అడ్తిదారు వద్దకే రైతులు తమ సరుకులను తీసుకుపోతారు. సదరు అడ్తిదారుడితో లింకు ఉన్న పత్తి వ్యాపారస్తుడు వచ్చి తన నోటికి ఎంత వస్తే ఆ ధరను చెప్తున్నాడు. వ్యాపారి చెప్పిన ధరకే రైతుకు ఇష్టం ఉన్నా.. లేకున్నా ఆ ధరకు ఇవ్వాల్సిందే. ఒకవేళ రైతు తనకు ధర నచ్చలేదని, సరుకు ఇచ్చేందుకు ఇష్టపడకపోతే ఆ రోజున ఆ పత్తి రైతు సరుకు వద్దకు మరే ఇతర వ్యాపారి కూడా తొంగి చూడడు. రైతు నమ్ముకొని వచ్చిన అడ్తిదారుడు కూడా వ్యాపారుల పక్షం చేరి బలవంతంగా ఇప్పిస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్‌లోని పత్తి కొనుగోలు దారులంతా ముందుగానే వ్యూహత్మకంగా ఈ రోజు ఈ ధరకు మించి మనం కొనుగోలు చేయవద్దని నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారమే వ్యాపారులంతా కట్టుబడి ఒకేరేటు మీద కొనుగోలు ప్రారంభించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

వ్యాపారులతో కుమ్మక్కవుతున్న మార్కెట్‌ అధికారులు
మార్కెట్‌లో రైతుల పక్షం వహించాల్సిన అధికారులు కమీషన్ల కక్కుర్తితో వ్యాపారుల పక్షం వహిస్తూ రైతులకు నష్టం చేకూరుస్తున్నారని ఆరోపణలు పెద్దఎత్తున ఉన్నాయి. వ్యాపారులు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసే క్రమంలో మధ్యవర్తిత్వం వహించే దళారుల(అడ్తిదారులు) కనుసన్నల్లోనే మార్కెట్‌ అధికారులు పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మార్కెట్‌లో నాణ్యమైన పత్తి వస్తున్న క్రమంలో ధర పెరగాల్సి ఉంటుంది. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే తేమ, గుడ్డి పత్తిని తీసుకొచ్చిన ప్పుడు ఉన్న ధర తేమ లేకుండా నాణ్యమైన పత్తిని తీసుకొస్తున్న క్రమంలో లేకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఎడతెరిపిలేని వర్షాలతో దేశవ్యాప్తంగా పత్తిసాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వానాకాలం సీజన్‌ పత్తి విత్తనం నాటినప్పటి నుంచి మొదటి రెండు కాపులు వచ్చేవరకు ఎడతెరిపి లేని వర్షాలతో తీవ్ర నష్టం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో నల్లరేగడి భూముల్లో పత్తి జాలుబారి ఎర్రపడి గూడ, పూత, పిందే లేకుండా నిలబడి పోవడంతో రైతులు గత్యంతరం లేక పత్తిని చెడగొట్టి మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలను సాగుచేసుకున్నారు. దేశీయ అవసరాలకు అనుగుణంగా పత్తి దిగుబడులు వచ్చే అవకాశం కనబడటంలేదు. దీంతో అనూహ్యంగా మార్కెట్‌లో పత్తికి ధర పెరగాల్సిన సమయంలో రోజురోజుకూ పడిపోతున్నా… మార్కెట్‌ అధికారులు నోరు మెదపకపోవడంపై వ్యాపారులతో కుమ్మక్కయ్యారనే అనుమానాలకు తావిస్తోందని పత్తి రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో మార్కెట్‌ ధరల స్థిరీకరణ కోసం కొంత ప్రత్యేకమైనటువంటి నిధిని రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించేది. కానీ ఈ ఏడాది మార్కెట్‌ ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయిం చకపోవడం కూడా రైతులకు నష్టం చేస్తోందని వాపోతున్నారు. పడిపోతున్న పత్తి ధరలపై ఇటు మార్కెట్‌ అధికారులు, అటు సీసీఐ స్పందించి మార్కెట్‌లో నాణ్యమైన పోటీతత్వాన్ని పెంపొందించి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement