Sunday, May 19, 2024

టిఎస్ పి ఎస్ సి ఛైర్మ‌న్, కార్య‌ద‌ర్శికి ఈడీ నోటీసులు ?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పేపర్‌ లీకేజీపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) టీ-ఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జనార్దన్‌ రెడ్డి, కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌తో సహా మరి కొంత మంది కమిషన్‌ సభ్యులను విచారించే అవకాశం ఉన్నట్టు- అత్యంత విశ్వ సనీయ వర్గాలు చెబుతున్నాయి. పేపర్‌ లీకేజీలో మనీ ల్యాండరింగ్‌ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్న ఈడీ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్టు- ప్రచారం జరుగుతోంది. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌లను విచారించ వలసి ఉందని నిర్ణయించిన ఈడీ అధికారులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డిలను తమ కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈడీ అధికారులు నేడు చంచల్‌గూడ జైల్లోనే ఇద్దరు నిందితుల నుంచి ఈడీ అధికారులు వాంగ్మూలం తీసుకుంటున్నారు.. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డితో పాటు- మరో ఏడుగురిని సిట్‌ అధికారులు గత నెల 13వ తేదీన అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంత మందిని సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ అధికారులు ఇప్పటి వరకు 17మందిని అరెస్ట్‌ చేశారు. 40లక్షల రూపాయలు చేతులు మారినట్లు- సిట్‌ అధికారుల దర్యాప్తులో తేలింది. సిట్‌ అధికారుల ఎఫ్‌ఐఆర్‌తో పాటు- మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు.


కాగా గత నెల 23న ఈసీఐఆర్‌ నమోదు చేసిన ఈడీ అధికారులు ఆ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే టీ-ఎస్‌పీఎస్‌సీ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ అధికారి శంకరలక్ష్మిని పిలిచి ప్రశ్నించారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డిలను ప్రశ్నించిన తర్వాత వాళ్లిచ్చే సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు మరికొంత మందికి నోటీ-సులు జారీ చేసే అవకాశం ఉంది.

ప్రశ్నపత్రాల ముద్రణ, పంపిణీ, కూర్పుపైనే దృష్టి పెట్టనున్న ఈడీ
ప్రవీణ్‌, రాజశేఖర్‌ల రెండు రోజుల విచారణను పూర్తి చేశాక ఈడీ అనుకుంటు-న్నట్టు- పూర్తి సమాచారం వస్తే కేసులో తదుపరి ముందుకు వెళ్లాలని, లేని పక్షంలో మరో రెండు మూడు రోజులపాటు- కస్టడీని పొడిగించాలని కోర్టును కోరే అవకాశం ఉందని భావిస్తున్నట్టు- తెలుస్తోంది. చంచల్‌గూడ కారాగారంలో ప్రవీణ్‌, రాజశేఖర్‌ల విచారణ ప్రక్రియనంతా వీడియో రికార్డ్‌ చేయాలని ఈడీ నిర్ణయించినట్టు- సమాచారం. కాన్ఫిడెన్షియల్‌ విభాగం అధికారిని శంకరలక్ష్మి తన విచారణ సందర్భంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకుని విచారణ జరుపుతారన్న ప్రచారం ఉంది. ఇద్దరు నిందితులు ఇచ్చే సమాచారం ఆధారంగా మిగతా వారిని ప్రశ్నించే వీలుందని చెబుతున్నారు. ప్రశ్నపత్రాల విక్రయం ద్వారా కేవలం 40 లక్షల రూపాయలు చేతులు మారాయా లేక ఇంకా పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగి ఉండే అవకాశాలు లేకపోలేదని ఈడీ అనుమానిస్తోంది. జరిగిన నగదు లావాదేవీలు బ్యాంకుల ద్వారానా లేక హవాలా ఇతర మార్గాల గుండా జరిగిందా అనే అంశంపై నిగ్గు తేల్చాలని ఈడీ భావిస్తోంది. పేపర్‌ లీకేజీపై ఏర్పా-టైన సిట్‌ టీ-ఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ను ఆయన కార్యాలయానికి వెళ్లి ఆరు గంటల పాటు- విచారించిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన సమాచారాన్ని సేకరించి దర్యాప్తులో ముందుకెళ్లేందుకు ఈడీ సైతం ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు- తెలుస్తోంది.

పేపర్‌ లీకేజీకి సంబంధించి కమిషన్‌ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈడీ పరిగణలోకి తీసుకున్నట్టు- సమాచారం. నమ్మి ప్రవీణ్‌కు కీలక బాధ్యతను కట్టబెడితే ఇలా చేస్తాడా అని జనార్దన్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పడాన్ని ఈడీ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు- సమాచారం. కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సభ్యులు లింగారెడ్డితో పాటు- ముగ్గురు సభ్యులకు నోటీ-సులు ఇవ్వాలన్న నిర్ణయానికి ఈడీ వచ్చినట్టు- సమాచారం. డబ్బులు చెల్లించి ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసిన నిందితులందరి వాగ్మూలాలను ఈడీ నమోదు చేయనుందని సమాచారం. ఒకవేళ మనీ ల్యాండరింగ్‌ జరిగినట్టు- నిర్దారణ జరిగితే ఈడీ మరో కేసు పెట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటు-న్నారు.

సిట్‌ అధికారుల దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు
టీ-ఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ అధికారి శంకరలక్ష్మి డైరీ నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను దొంగలించి.. నిందితులు పేపర్‌ లీకేజీకి పాల్పడినట్లు- మొదటినుంచి సిట్‌ చెబుతూ వస్తోంది. అయితే డైరీని స్వాధీనం చేసుకున్న తర్వాత సిట్‌ అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అసలు ఆమె డైరీలో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఎక్కడా రాయలేదని దర్యాప్తులో తేలింది. నిందితులు మాత్రం ఆమె డైరీ నుంచే దొంగలించామని తమ రిపోర్టులో పేర్కొన్నారు. మరి ఎక్కడ నుంచి వాటిని సేకరించారనే తర్జన భర్జనలో సిట్‌ అధికారులు పడ్డారు. తన డైరీలో ఎలాంటి సమాచారం లేదని.. శంకరలక్ష్మి ఈడీ అధికారుల విచారణలో ఇదే విషయాన్ని తెలిపినట్లు- సమాచారం. ఈ కేసును పూర్తిగా చేధించేవరకు ఈడీ తమ దర్యాప్తును ముమ్మరం చేయనుంది. అందులో భాగంగా ప్రధాన నిందితులను విచారించేందుకు నాంపల్లి కోర్టులో అనుమతి తెచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement