Saturday, May 4, 2024

తేజస్వీ యాదవ్ కి ఊరట..బెయిల్ రద్దు చేసేందుకు నిరాకరించిన కోర్టు

బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ బెయిల్ రద్దు చేసేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఐఆర్‌సీటీసీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై తేజస్వీ యాదవ్ బెయిల్‌ను రద్దు చేసేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం నిరాకరించింది. బహిరంగంగా మాట్లాడే సమయంలో బాధ్యతగా నడుచుకోవాలని, ఆచితూచి మాట్లాడాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ గీతాంజలి గోయెల్ హెచ్చరించారు. కేసును దర్యాప్తు ప్రభావితం చేసేందుకు తేజస్వీ ప్రయత్నిస్తున్నారని, మీడియా సమావేశంలో అధికారులను బెదిరించారని ఆరోపించింది.

తనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారంటూ బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును ఆశ్రయించింది. మంగళవారం కోర్టులో విచారణ జరుగగా.. తేజస్వీ యాదవ్‌ హాజరయ్యారు. తేజస్వీ తరఫున న్యాయవాది మనీందర్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. తేజస్వీ విలేకరుల సమావేశం వెనుక ఉద్దేశం వేరని, పాత్రికేయుల సమావేశంలో కుంభకోణాలు, రాజకీయ తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయని కోర్టుకు తెలిపారు. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌తో పాటు ఆ కేసులో రెయిడ్స్‌పై మాట్లాడినంత మాత్రాన ఐఆర్‌సీటీసీ కేసులో బెయిల్‌ను రద్దు చేయాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. తప్పిదాలు జరిగినట్టు అనిపిస్తే విపక్ష పార్టీలు దానిపై ప్రశ్నలు లేవనెత్తుతాయని, ప్రస్తుత ప్రభుత్వం సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తుందని తేజస్వీ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీబీఐ తరఫున డీపీ సింగ్ వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించిన సీబీఐ అధికారి ఒకరు ఇటీవల ప్రమాదానికి గురయ్యారని, సాక్ష్యం లేనందున దీన్ని బెదరింపుగా సీబీఐ భావించలేదన్నారు. తేజస్వి యాదవ్ ఇటీవల మీడియాతో మాట్లాడిన తర్వాత తమ అధికారులకు తప్పనిసరిగా ముప్పు ఉందనే అభిప్రాయానికి సీబీఐ వచ్చిందని, ఈ మేరకు బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement