Sunday, April 28, 2024

దేవరయాంజల్లో భూములు పరిశీలించనున్న నిజనిర్ధారణ కమిటీ!

దేవరయాంజల్ భూ అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీ దేవరయాంజల గ్రామాన్ని సందర్శించనుంది. సాయంత్రం 4 గంటలకు కమిటీ భూములను పరిశీలించనుంది.

మరోవైపు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్​పేట్​ మండలం దేవర యాంజల్​లోని సీతారామచంద్ర స్వామి ఆలయానికి చెందిన భూములను అధికారుల బృందం పరిశీలించింది. దేవాలయానికి చెందిన 1,521ఎకరాల 13గుంటల భూమి అన్యాక్రాంతంపై ప్రభుత్వం వేసిన ఐఏఎస్ కమిటీ సభ్యులు పరిశీలించారు. పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ప్రశాంత్ జీవన్ పాటిల్, కలెక్టర్ శ్వేతా మహంతి, మంచిర్యాల కలెక్టర్ భారతి హోళీకెరీ, ఏసీబీ, విజిలెన్స్, దేవాదాయ శాఖ అధికారులు… భూములపై ఆరా తీశారు. భూమలు వ్యవహారంపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 8 మంది తహసీల్దారులతో ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నారు. గ్రామ పరిధిలోని పలు సర్వే నంబర్​లలో ఉన్న ఆలయ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయనే కోణంలో అధికారులు కూపీలాగుతున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గోదాంలను కమిటీ బృందం పరిశీలించింది.

దేవరయాంజాల్‌ గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయానికి మొత్తం 1521 ఎకరాల భూమి ఉన్నట్లు దేవాదాయ శాఖ చెబుతోంది. అయితే ఈ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైనట్లు, వీటికి సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు చాలా ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, మరికొంత మంది ఈ భూములను ఆక్రమించినట్లు ఈ నెల 2న కొన్ని స్థానిక పత్రికలు కథనాలను ప్రచురించాయని తెలిపింది. తమ పేర్లతో, తమ బినామీ పేర్లతో వీరు చట్ట విరుద్ధంగా, పెద్ద మొత్తంలో భూములను ఆక్రమించారన్నది ఆ కథనాల సారాంశమని వివరించింది. ఇలా ఆక్రమించిన భూముల విలువ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని, దీంతో ఆలయం విలువైన భూములను కోల్పోయినట్లయిందని పత్రికలు వెల్లడించినట్లు తెలిపింది. పైగా చట్టాలను ఉల్లంఘించి, ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భూముల్లో భారీ నిర్మాణాలను చేపట్టారంటూ ఆ కథనాలు తెలిపాయని పేర్కొంది. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు కోసం ఐఏఎస్ కమిటీని వేస్తున్నట్లు వెల్లడించింది. 

ఐఏస్ల కమిటీ నియామకం నేపథ్యంలో దేవరయాంజాల్‌ భూముల్లో విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. సీతారామస్వామి దేవస్థానం భూములు ఎవరెవరి అధీనంలో ఉన్నాయన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ భూముల్లో పలువురు రైతులు గోదాములు నిర్మించుకున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కూడా ఇందులో 6.20 ఎకరాల భూమి ఉంది. దీంతో ఈటలకు సంబంధించిన గోదాములను కూడా అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం దేవరయాంజాల్‌ తూంకుంట మునిసిపాలిటీ పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో మునిసిపాలిటీలోనూ నిర్మాణాలపై రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. గోదాముల నిర్మాణాలు ఎప్పుడు జరిగాయి? ఎంతమేరకు ట్యాక్స్‌లు చెల్లిస్తున్నారు? వంటి వివరాలను విజిలెన్స్‌ అధికారులు సేకరించినట్టు తెలిసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement