Sunday, April 28, 2024

వ్యాక్సినేషన్‌లో కేంద్రం తీరుపై చిదంబరం విమర్శలు

18 ఏళ్లు పైబ‌డిన వారికి ఉచిత వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైన మరుస‌టి రోజే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డోసుల సంఖ్య గ‌ణ‌నీయంగా ప‌డిపోయింద‌ని కాంగ్రెస్ ఎంపీలు చిదంబ‌రం, జైరాం ర‌మేష్ కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. ఆయా రాష్ట్రాల్లో సోమ‌వారం నుంచి మంగ‌ళ‌వారానికే వ్యాక్సినేష‌న్ నెంబ‌ర్లు దారుణంగా ప‌త‌న‌మ‌య్యాయ‌ని విస్మ‌యం వ్య‌క్తం చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ అత్య‌ధికంగా సోమ‌వారం మొద‌టి రోజున 16,91,967 వ్యాక్సిన్ డోసులు ఇవ్వ‌గా మ‌రుస‌టి రోజు (జూన్ 22) కేవ‌లం 4825 మందికే వ్యాక్సినేష‌న్ చేప‌ట్టార‌ని ఇది ప్ర‌చార తంతుగా మిగిలిపోయింద‌ని చిదంబ‌రం ఆరోపించారు.

బీజేపీ పాలిత క‌ర్నాట‌క‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లోన ఇదే తంతు సాగింద‌ని అన్నారు. సోమ‌వారం రికార్డు వ్యాక్సినేష‌న్ క‌స‌ర‌త్తును బాగానే ర‌క్తిక‌ట్టించార‌ని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మ‌రుస‌టి రోజే వ్యాక్సిన్ డోసుల్లో భారీ కోత విధించార‌ని రికార్డు కోసం బాగా శ్ర‌మించార‌ని మోదీ స‌ర్కార్‌ను ఉద్దేశించి చిదంబ‌రం చుర‌క‌లు వేశారు. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో సోమ‌వారం 16 ల‌క్ష‌ల‌కు పైగా వ్యాక్సిన్ డోసులు వేయ‌గా మ‌రుస‌టి రోజు కేవ‌లం నాలుగు వేల‌కు ప‌రిమితం చేశార‌ని, ఎవ‌రిని మోస‌గించ‌డానికి ఇలా చేస్తున్నార‌ని కాంగ్రెస్ ఎంపీ జైరాం ర‌మేష్ కేంద్ర ప్ర‌భుత్వ వ్యాక్సినేష‌న్ తీరును దుయ్య‌బ‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement