Tuesday, May 14, 2024

కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. సిద్దరామయ్య, డీకేలకు చోటు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అంతకుముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించింది హస్తం పార్టీ. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. 124 మందితో కూడిన పేర్లను విడుదల చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కనకాపుర ప్రాంతం నుంచి బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు పలువురు కీలక నేతల పేర్లను సైతం పార్టీ ప్రకటించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర కొరటాగెరె (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ పడనున్నారు. మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప దేవనహళ్లిలో తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేకు సైతం ఈ జాబితాలో చోటు దక్కింది. ప్రియాంక్ ఖర్గే చిటాపుర్ (ఎస్సీ) స్థానం నుంచి బరిలో దిగనున్నారు. ఇంతవరకూ ఆ రాష్ట్రంలో మరే ఇతర పార్టీ.. తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు.

మార్చి 17నే తొలి జాబితాలోని పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఫైనల్ చేసింది. ఢిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయి.. పేర్లపై చర్చించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి రాహుల్ గాంధీ సహా పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. కర్ణాటక అసెంబ్లీ గడువు మే నెలతో ముగియనుంది. ఆ లోపే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉన్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. 104 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 సీట్లు గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని నెలకొల్పాయి. అనంతరం ఆ కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇద్దరు స్వతంత్రులు తమ మద్దతును బీజేపీకి ప్రకటించారు. ఈ పరిణామాల వల్ల కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మెజార్టీ కోల్పోయింది. బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ అధికారం చేపట్టింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement