Saturday, April 27, 2024

పంద్రాగస్టు వేడుకల్లో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల మధ్య గొడవలు బయటపడ్డాయి. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జెండా ఆవిష్కరణ జరుగుతోన్న సమయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గొడవకు దిగారు. ఈ క్రమంలోనే పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

కాగా ఈ తతంగాన్ని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు చిత్రీకరించారు. దీంతో పలువురు కార్యకర్తలు మీడియా ప్రతినిధులపై దాడి చేసి ఫోన్‌లను లాక్కొని వెళ్లారు. కాగా ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి, స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కూడా పాల్గొన్నారు. ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కాగా ఈ దాడిలో గాయపడిన శ్రావణ్ మల్కాజ్‌గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు నేతలు ఆసుపత్రికి చేరుకోనున్నారు.

ఈ వార్త కూడా చదవండి: గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement