Tuesday, May 7, 2024

సుడిగాలిలో చిక్కుకున్న పిల్లాడు.. కాపాడిన అంపైర్.. వీడియోతో

పిల్ల‌లు బేస్ బాల్ మ్యాచ్ ఆడుతుండ‌గా సుడిగాలి వ‌చ్చింది.ఆ గాలిలో ఓ పిల్లాడు చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దాంతో ద‌గ్గ‌ర్లో ఉన్న అంపైర్ వెంట‌నే స్పందించి ఆ పిల్లాడిని కాపాడాడు. కాగా మైదానంలోని కెమెరాల్లో రికార్డైన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి పిల్లాడి ప్రాణాలు కాపాడావంటూ పదిహేడేళ్ల యువ అంపైర్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఫ్లోరిడాలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జాక్సన్ విల్లేకు చెందిన జోయా తన స్నేహితులతో కలిసి స్థానిక మైదానంలో బేస్ బాల్ మ్యాచ్ ఆడుతున్నాడు.

ఇంతలో జోయా నిల్చున్నచోట ఉన్నట్టుండి సుడిగాలి ఏర్పడింది. వేగంగా సుడులు తిరుగుతున్న గాలి మధ్య చిక్కుకున్న జోయా ఊపిరి ఆడక సతమతమయ్యాడు. ఆ మ్యాచ్ కు అంపైర్ గా వ్యవహరిస్తున్న ఐదాన్ విల్స్ వేగంగా వచ్చి జోయాను సుడిగాలి నుంచి బయటకు ఎత్తుకుని వచ్చాడు. దీంతో తేరుకున్న జోయా.. కాసేపటికి మళ్లీ మ్యాచ్ ఆడడంలో మునిగిపోయాడు. తర్వాత ఈ ఘటనపై మాట్లాడుతూ.. సుడిగాలిలో చిక్కుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని జోయా చెప్పాడు. దీంతో ఊపిరి బిగబట్టి సాయం కోసం ఎదురుచూశానని అన్నాడు. ఐదాన్ విల్స్ సమయస్ఫూర్తిని జోయా తండ్రి బ్రియాన్ మెచ్చుకున్నారు. అనుకోని ప్రమాదం ఏర్పడినపుడు వేగంగా స్పందించడం మెచ్చుకోదగ్గ విషయమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement