Sunday, April 28, 2024

మీడియాపై సీజేఐ రమణ అసహనం

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామాకం కోసం కొలీజియం తొమ్మిది పేర్లను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మీడియా కథనాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణ సందర్భంగా బుధవారం జరిగిన వీడ్కోలు సమావేశంలో జస్టిస్ రమణ మాట్లాడుతూ.. కొలీజియం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనకు ముందే నియామకాలపై కథనాలు రావడం వల్ల అవాంఛనీయ ఫలితాలు వస్తాయని అన్నారు. ఇటువంటి కథనాలు ప్రచురించే విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియాకు సూచించారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ అత్యంత పవిత్రమైందని.. దీనికి సముచిత గౌరవం ఉందన్నారు. ఈ విషయాన్ని మీడియా అర్థం చేసుకోవాలని కోరారు. గొప్ప స్థాయికి ఎదగాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారని, అయితే, ఇలాంటి బాధ్యతారహితమైన వార్తల వల్ల అలాంటి వారి కెరీర్ నష్టపోయిన దాఖలాలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. ఈ పరిణామాలు చాలా దురదృష్టకరమని, తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఇంతటి సీరియస్ వ్యవహారాన్ని ప్రసారం చేయని సీనియర్ జర్నలిస్టులు, మీడియా సంస్థలను అభినందిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం జడ్జిల నియామక ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే దానిపై సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ వార్త కూడా చదవండిః దేశానికి కాబోయే మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement