Friday, April 26, 2024

నీట మునిగిన చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు .. పాఠశాలలకు సెలవు

అక్టోబర్ 29నుండి తమిళనాడులో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో అనేక జిల్లాలో రెండు రోజులగా పలు పాఠశాలలను మూసివేశారు. గురువారం సాయంత్రం ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. సాయంత్రం ఆగకుండా కురిసిన వర్షం వల్ల ఆఫీసుల నుంచి పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న ప్రజలు రోడ్లపై తడిసి ముద్దయ్యారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. అంబత్తూరుతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు నీళ్లల్లోనే పరుగులు తీశారు. పాడైన రోడ్లు, నీటి అడుగున గుంతలు పొంచి ఉండడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఈ భారీ వర్షాల నేపథ్యంలో నవంబర్ 4న చెన్నైలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నవంబర్ 4-5 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అక్టోబరు 29 రుతుపవనాల ప్రారంభమైన తరువాత తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ పరిసర ప్రాంతాలలో వానలు కురిశాయి. అక్టోబర్ 30న కేరళ, మాహే, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని మిగిలిన ప్రాంతాల్లో వర్షం కొనసాగిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ప్రస్తుతం వరకు ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ వారంతం వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ మాహేలలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోందని వాతవరణ శాఖ తెలిపింది. నేడు (శుక్రవారం) దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement