Monday, April 29, 2024

PRC Sadhana Samithi: ఫిబ్రవరి 3న ‘చలో విజయవాడ’.. లక్షలాది మందితో పోరు!

పీఆర్సీ ఉద్యమాన్ని ఉద్యోగులు తీవ్రతరం చేస్తున్నారు. ఈ క్రమంలో ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని ఉద్యోగ సంఘాల ఐక్య జేఏసీ భావిస్తోంది. లక్ష మంది ఉద్యోగులతో ఫిబ్రవరి 3న ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డును అనువైన వేదికగా నిర్ణయించారు. ఫిబ్రవరి 3న ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, కాంట్రాక్టు-అవుట్‌ సోర్సింగ్‌, కంటింజెంట్‌ ఉద్యోగులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. ‘చలో విజయవాడ’కు భారీగా ఉద్యోగులను సమీకరించటం ద్వారా ప్రభుత్వానికి గట్టి సందేశాన్ని పంపాలని పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ భావిస్తోంది. 

మరోవైపు ప్రభుత్వం కొత్తగా జారీచేసిన పీఆర్సీ జీవోలతో తమకు తీవ్రనష్టం కలుగుతుందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. తమ కోరికలు నెరవేర్చడంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అయితే ఉద్యోగ సంఘాల నాయకులే చర్చలకు రావడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి అనేకసార్లు తిరిగి.. తమ సమస్యలను వివరించామన్నారు. తమకు జరిగిన ప్రతి అన్యాయానికి సజ్జలనే సాక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఫిబ్రవరి 3న చలో విజయవాడకు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ఉద్యోగులు తరలిరావాలని ఆయన కోరారు. ఈ నెల పాత జీతాలే చెల్లించాలని కోరారు. జీతాలు ఇవ్వకుండా తమను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement