Thursday, May 2, 2024

Central Team Visit – ఈసారైనా కేంద్ర సాయం అందేనా…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:
అతిభారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణలో నష్టం అంచనాకు నేడు కేంద్ర బృందం రానున్నది. తెలంగాణకు తీరని నష్టాన్ని మిగిల్చిన ఈ వర్షం ప్రాణ, ఆస్తి నష్టాలను మిగిల్చింది. లక్షల ఎకరాల పంట పొలాలు ఇంకా నీటిలోనే మునిగి ఉండగా, భారీ ఎత్తున రహదారులు, వంతెనలు, పలు ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కూలిపోగా, పలు చెరువులకు గండ్లు పడ్డాయి. కాలనీల్లోకి వరద నీరు పోటెత్తడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల ఫలితంగా నష్ట తీవ్రత తగ్గింది. ఆ తర్వాత అప్రమత్తంగా వ్యవహరించి అనేక హెచ్చరికలు జారీ చేయడంతో ప్రాణ నష్టాన్ని అరికట్టగలిగింది. ఈ నేపథ్యంలో నష్టం అంచనా వేసి సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇందుకు స్పందించిన మోడీ సర్కార్‌ కేంద్రంలోని ఉన్నతాధికారులతో కమిటీని నియమించింది. ఎన్‌డీఎంఏ సలహాదారు కునాల్‌ సత్యార్థి నేతృత్వంలోని కేంద్ర బృందం నేడు రాష్ట్రానికి రానున్నది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించి వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయనుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఏనాడూ పడనంత అతి భారీ వర్షాలు కురవడంతో తీవ్ర నష్టం వాటిళ్లింది. ఈ వర్షాలు, వాటితో పోటెత్తిన వరదలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అపార నష్టం సంభవించింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు 20మంది మరణించగా, పలువురి ఆచూకీ ఇంకా తెలియలేదని సమాచారం. ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం రూ.3 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. 10.92 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని, మరో 4 లక్షల ఎకరాల మొలక దశలోని పంటలు నష్టోయినట్లుగా ప్రాథమిక అంచనా. తద్వారా వ్యవసాయ రంగంలో రూ.1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లుగా అంచనా. ప్రధానంగా ఆదిలాబాద్‌ కుమరంభీం అసిఫాబాద్‌, నిజామాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జనగామ, కరీంనగర్‌, వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు గుర్తించారు.


గోదావరికి వచ్చిన వరదతో నదికి ఇరువైపులా కిలోమీటర్ల మేర పంట నీట మునిగింది. సోయాబీన్‌ పంటపై కూడా భారీగా ప్రభావం పడిందని చెబుతున్నారు. 40.73 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి పంటకు భారీ ప్రభావం నమోదైంది. పత్తి విత్తనాలు మొలక దశలోనే పాడైనట్లుగా అంచనా. మొక్కజొన్న వేరుశనగా, కందులు వంటి పంటలు మొలక దశలోనే భూమిలో ఉండిపోయాయి. మొలకెత్తిన చోట వరదలో కొట్టుకుపోయినట్లుగా గుర్తించారు. కూరగాయల తోటలు కుళ్లిపోగా, వరి పొలాల్లో ఇసుక మేటలు వేసింది.

ఇక పలు శాఖలకు భారీగా నష్టం వాటిళ్లగా అందులో కొంతమేర విద్యుత్‌ శాఖ ఇప్పుడిప్పుడే కోలుకొంటోంది. పంచాయతీరాజ్‌ శాఖకు రాష్ట్రవ్యాప్తంగా 1416 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినగా, రూ. 589కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 837 కల్వర్టులు కూలిపోగా, రూ.400 కోట్ల నష్టం జరిగిందంటున్నారు. రోడ్లు, వంతెనలకు రూ.700 కోట్ల మేర నష్టం జరిగిందని ఆర్‌ అండ్‌ బీ శాఖ నివేదించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై 47 వంతెనలు దెబ్బతిన్నట్లుగా నిర్దారించారు. 2 వేల 509 ఇండ్లు కూలిపోయినట్లుగా క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందాయి. విద్యుత్‌ సంస్థలు రూ.21 కోట్ల మేర నష్టపోగా, 400లకు పైగా చెరువులు, కుంటలు దెబ్బతిన్నాయి.

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సలహాదారు కునాల్‌ సత్యార్ధి నేతృత్వంలోని కమిటీలో వ్యవసాయ, ఆర్థిక, జలవనరుల శాఖ, విద్యుత్తు, రోడ్డు రవాణా, రహదారులు, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ వంటి వివిధ శాఖలు, విభాగాల అధిపతులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. స్వయంగా వరద తీవ్రతను పరిశీలించి పలువురు బాధితులతో మాట్లాడనుంది. జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే వివరాలను కూడా సేకరించి అధికారులతో చర్చించనుంది. కలెక్టర్లు, సీఎస్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన వివరాలతోపాటు, స్వయంగా ఈ కమిటీ సేకరించిన సమాచారంతో నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది.

ఈ నివేదిక ఆధారంగానే కేంద్రం రాష్ట్రానికి వరద సహాయక నిధులను ప్రకటించనుంది. ఈ బృందం వేసే అంచనాలు, ఇచ్చే నివేదికల ఆధారంగానే కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. తాజా అతిభారీ వర్షాలను పరిగణలోకి తీసుకొని ఈ విపత్తును ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ కమిటీ ఆగస్టు 2న కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement