Saturday, April 27, 2024

BRS – వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ వ‌రుస టూర్ల‌తో కారు స్పీడ్

అసెంబ్లీ ఎన్నికలపై పక్కా ప్లాన్‌ …వర్కింగ్‌ ప్రెసిడెంట్ వరుస టూర్లు… గెలుపు ఖాయం అభ్యర్థుల ప్రకటన…
ఇప్పటికే 18మంది సిట్టింగులకు ఓకే … హుజూరాబాద్‌ సహా మరికొన్ని స్థానాల్లో అభ్యర్థిత్వాలపై కొనసాగుతున్న సస్పెన్స్ … ప్రకటించని శాసనసభ నియోజకవర్గాల్లో ఆశావహుల్లో పెరుగుతున్న ఆశలు..
యువనేత సభ కోసం ఎదురుచూపులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అసెంబ్లి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార భారాస పార్టీలో పోటీ తీవ్రత పెరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో సిట్టింగ్‌తో పాటు ఆశావహులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి పలు సార్లు సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తామని అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. మరోవైపు గత సమావేశాల్లోనూ పార్టీ ఎమ్మెల్యేల పని తీరు సరిగ్గా లేకపోతే మార్చుతామని హెచ్చరించారు. ఆ ప్రకటనతో ఆశావహులు అధిష్టా నం పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ తమకు అవ కాశం కల్పించాలని విన్నవించుకుంటున్నారు. సిట్టింగ్‌లలో ఇప్పట్టికే కొంత మంది ఎమ్మెల్యేలకు టికెట్లు కన్ఫామ్‌ అయినట్లుగా అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయా అసెంబ్లిd స్థానాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రజలను
కోరారు.

సిట్టింగ్‌లకు సంకేతాలు ఇచ్చిన స్థానాలు
కూకట్‌పల్లి – మాధవరం కృష్ణారావు
భూపాలపల్లి – గండ్ర వెంకటరమణా రెడ్డి
వర్ధన్నపేట – ఆరూరి రమేష్‌
హుస్నాబాద్‌ – వొడితెల సతీష్‌ కుమార్‌
కరీంనగర్‌ – గంగుల కమలాకర్‌
వరంగల్‌ వెస్ట్‌ – దాస్యం వినయ్‌ భాస్కర్‌
మిర్యాలగూడ – నల్లమోతు భాస్కర రావు
ఆంధోల్‌ – చంటి క్రాంతి కిరణ్‌
అచ్చంపేట – గువ్వల బాలరాజు
దేవరకద్ర – ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి
ఎల్లారెడ్డి – జాజుల సురేందర్‌
ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి
సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య
ఆర్మూర్‌ – జీవన్‌ రెడ్డి
నిజామాబాద్‌ అర్బన్‌ – గణష్‌ గుప్తా
బోధన్‌ – షకిల్‌
మహబూబ్‌నగర్‌ – శ్రీనివాస్‌ గౌడ్‌
తుంగతుర్తి – గాదరి కిషోర్‌
కరీంనగర్‌ పార్లమెంట్‌ – బోయినపల్లి వినోద్‌ కుమార్‌

- Advertisement -

పర్యటనలపై ఉత్కంఠ
ప్రస్తుతం మంత్రి కేటీఆర్‌ ఏ నియోజకవర్గంలో పర్యటించినా ఒక్కటే చర్చ సాగుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను గెలిపించాలంటూ సంకేతాలు ఇస్తున్నారా..? లేదా..? అని గుసగుస లాడుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని గులాబీ శ్రేణులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొన్ని స్థానాల్లో మంత్రి కేటీఆర్‌ అభివృద్ధి పనుల్లో పాల్గొని పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. భారాస సర్కార్‌ చేసిన అభివృద్ధిని వివరిస్తూ అందరిని కలుపుకొని వెళ్తున్నారు. సందిగ్ధంలో ఉన్న స్థానాలు, పోటీ తీవ్రత ఎక్కువ ఉన్న చోట్ల ఎలాంటి సంకేతాలను ఇవ్వడం లేదు. పార్టీ గెలుపు కోసం అందరూ పని చేయాలని సూచిస్తున్నారు.

ఈ స్థానాల్లో సస్పెన్స్‌
పలు స్థానాల్లో పోటీ ఎక్కువ ఉన్న చోట్ల, ఇప్పటికి ఖరారు కాని స్థానాల్లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కానీ, అధిష్టానం కానీ ఆచి తూచి ముందుకు వెళ్తోంది. ఆయా స్థానాల్లో సిట్టింగ్‌లతో పాటు ఆశావహులు తమ తమ బలాలను ప్రదర్శించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. తాజాగా వరంగల్‌ ఈస్ట్‌లో మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి సభలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌పై ప్రశంసలు కురిపించారు. మరోసారి అవకాశం ఇస్తామని ఎలాంటి సంకేతాలను ఇవ్వలేదన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, మేయర్‌ గుండు సుధారాణి టికెట్‌ను ఆశిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఉప్పల్‌ నియోజకవర్గంలోనూ ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి కేటీఆర్‌ బహిరంగ సభలో ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డి చేసిన అభివృద్ధిని, ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరించారు. ఎక్కడా మళ్లిd టికెట్‌ భేతి సుభాష్‌ రెడ్డికి అనే సంకేతాలను ఇవ్వలేదన్న చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది. ఇక్కడి నుంచి మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, బండారి లక్ష్మారెడ్డి, తాడూరి శ్రీనివాస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 2023 అసెంబ్లిd ఎన్నికల్లో ఇస్తామన్న హామీని ఇప్పుడు నెరవేర్చాలని బొంతు రామ్మోహన్‌ కోరుతున్నారు. అధిష్టానం పెద్దలతో సత్సంబంధాలు కలిసి వచ్చే అవకాశంగా భావిస్తున్నారు. శుక్రవారం మహబూబాబాద్‌లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి, సంక్షేమంపై మాత్రమే ప్రస్తావించారు. ఎక్కడా మళ్లిd పార్టీ అవకాశం ఇస్తుందన్న సంకేతాలను ఇవ్వలేదని గులాబీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక్కడి నుంచి ఎంపీ మాలోతు కవిత టికెట్‌ను ఆశిస్తున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ సైతం రేసులో ఉన్నారు. ప్రధానంగా డోర్నకల్‌ నుంచి ఆశిస్తున్నారు. అక్కడ రాని పక్షంలో మహబూబాబాద్‌ నుంచి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎంపీ మాలోతు కవిత ఇక్కడి నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గెలుపు అవకాశాలను బట్టి ఆయా స్థానాల్లో అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నట్లుగా పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

సందిగ్ధంలో హుజూరాబాద్‌..!
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ గతంలో గులాబీకి కంచుకోటగా ఉండేది. ఈటల రాజేందర్‌ పార్టీ మారడంతో అక్కడి నుంచి ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డిని రంగంలోకి దించేందుకు అధిష్టానం సిద్ధమైంది. ఆ దిశగా సంకేతాలను ఇచ్చి నియోజకవర్గంలో ప్రోత్సహించింది. మొదట్లో గెలుపు అవకాశాలు పార్టీకి పెరిగినట్లుగా అధిష్టానం భావించింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరిని రంగంలోకి దించితే బాగుంటుందన్న ఆలోచనలను చేస్తున్నట్లుగా చర్చ సాగుతోంది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, ముదిరాజ్‌ కులస్థులను తిట్టారన్న విమర్శలు, ఆందోళనలు, జర్నలిస్ట్‌లపై దాడులు, దూషణలు చేశారన్న ఆరోపణలు పాడి కౌశిక్‌కు ఇప్పుడు మైనస్‌గా మారినట్లు పార్టీ అంచనా వేస్తోంది. ఈటలను ఓడించాలన్న పట్టుదలతో ఉన్న అధిష్టానం ఆ దిశగా ఆలోచనలను చేస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్లను మరోసారి పరిశీలిస్తున్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement