Friday, May 3, 2024

Death Zone – ఉసురు తీస్తున్న ఫార్మా కంపెనీలు….

అమరావతి, ఆంధ్రప్రభ: ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలే ఉసురు తీస్తున్నాయి. ఫార్మా కంపెనీల్లోకార్మికులకు రక్షణ కరువు అవుతోంది. యాజమాన్యాలు కార్మికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. దీంతో ఏటా కార్మికులు మృత్యువాత పడుతున్నారు. ఫార్మా కంపెనీల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉండాలి. ఎక్కడా ఆదిశగా చర్యలు చేపట్టడం లేదు. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు గడించాలనే దురాలోచనతో సబ్‌ కాంట్రాక్టర్లకు పరిశ్రమల నిర్వహణ అప్పగిస్తున్నారు. సబ్‌ కాంట్రాక్టర్లు నైపుణ్యం లేని వారిని తక్కువ వేతనాలతో నియమించడంతో తరుచు ప్రమాదాలు సంభవిస్తున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. భద్రత గురించి ప్రశ్నించే కార్మికుల్ని యాజమాన్యాలు నిర్ధాక్ష్యణ్యంగా విధుల నుంచి తొలిగిస్తున్నాయి. దీంతో కార్మికులు భయపడి బిక్కుబిక్కుమంటు ఉద్యోగాలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఫార్మా కంపెనీలు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై చూపడం లెెదనేది బహిరంగ రహస్యం. కార్మికులకు భద్రతా పరికరాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఫ్యాక్టరీ ఇన్స్‌పెక్టర్లు, కార్మికశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి లోపాలను సరిచేయాల్సి ఉన్నప్పటికీ ఫార్మా కంపెనీల్లో ఇదంతా మొక్కుబడి తంతుగా మారుతోంది.

కంట్రోల్‌ కాని రియాక్టర్లు
ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లలో హై టెంపరేచ్‌లో ద్రవకాలను మరిగించాల్సి ఉంటుంది. నిపుణులైన ఉద్యోగులు లేకపోవడం వల్ల తరుచు ప్రమాదాలు సంభవిస్తున్నాయనే ఆరోణపణలు ఉన్నాయి. రియాక్టర్లు పేలినప్పుడు కంట్రోల్‌ చేయాలంటే నిపుణులు ఉండాలి అత్యధిక శాతం కంపెనీల్లో అరకొర నాలెడ్జి ఉన్న వారే ఉండటంతో ప్రమాద సమయాల్లో రియాక్టర్లను కంట్రోల్‌ చేయడం కష్టంగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా పలు సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వ్యర్థ రసాయనాలు వెళ్ళే పైల్‌లైన్‌ సక్రమంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యాలతో పాటు అధికారులు పర్యవేక్షించాలి. వ్యర్థ రసాయనాలను శుద్ధి చెెసి పైల్‌లైన్‌ గుండా బయటకు పంపాల్సి ఉన్నప్పటికీ పలు కంపెనీలు ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ లోని సాహితీ ల్యాబ్‌ లో రియాక్టర్‌ భారీ పేలుడు కారణంగా ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడగా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ల్యాబ్‌లో కెమికల్స్‌ మరిగించే క్రమంలో వ్యాపించిన మంటలే ప్రమాదానికి కారణంగా అధికారులు గుర్తించారు. అక్కడ డ్రమ్ముల్లో పెట్రోల్‌ నిల్వ ఉంచడం వల్ల మంటల తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. అచ్యుతాపురం సేజ్‌లో 208 పరిశ్రమలు ఉన్నాయి. ఒకదాన్ని అనుకొని ఒక పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. స్థలాల కేటాయింపులో జరిగిన అవకతవకల కారణంగానే ఇష్టానుసారం పరిశ్రమలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పటికీ ఏపీఐఐసీ ఉదాశీనంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా రసాయన పరిశ్రమలో మంటలు వ్యాప్తి చెందితే ఎలా అదుపు చేయాలనే జాగ్రత్తలు ఇక్కడ మచ్చుకైనా కనిపించడం లేదంటే అధికారులు తనిఖీలు ఎంత బాగా చేస్తున్నారో అర్థం అవుతోంది. ఫార్మా కంపెనీల్లో కనీస భద్రత ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అచ్యుతాపురంలో సేజ్‌లో తరుచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. రసాయనాలు ఎక్కువగా నిల్వ చేస్తున్న యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

- Advertisement -

వెక్కిరిస్తున్న భద్రతా ప్రమాణాలు
ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు వెక్కిరిస్తున్నాయి. కార్మికుల భద్రత విషయంలో రాజీపడితే సహించేది లేదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గతంలో స్పష్టం చేశారు. అయినప్పటికీ అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రాలేదనడానికి తాజా అచ్యుతాపురం ఘటనే అద్దం పడుతోంది. ఫార్మాకంపెనీ ల్లో ప్రమాదాలను అరికట్టేందుకు ఫ్యాక్టరీ ఇన్స్‌ పెక్టర్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ, డీఎస్‌పీ, ఆర్డీఓ, తహశీల్దార్లతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈకమిటీ తరుచు తనిఖీలు నిర్వహిస్తూ భద్రత విషయంలో యాజమాన్యాలకు సూచనలు చేయాల్సి ఉంటుంది. వాటిని అమలు చెెసేలా చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో ఈ కమిటీ తనిఖీలు మొక్కుబడిగా మారాయి. మంత్లిdమామూళ్ళ మోజులో నిబంధనల్ని గాలికి వదిలేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఫార్మా కంపెనీల్లో తరుచు సంభవిస్తున్న ప్రమాదాల్లో ప్రధాన కారణం రియాక్టర్లు పేలడమే. నిపుణులైన ఉద్యోగులు ఉంటే ఈపరిస్థితి రాదని తెలిసినప్పటికీ ఆదిశగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారనేది ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఫార్మాకంపెనీల్లో ప్రమాదాలు సంభవించినప్పుడల్లా కార్మికుల కుటుంబాలు, సమీప ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురికావాల్సి వస్తోంది. గతంలోనూ అచ్యుతాపురం సెజ్‌ లో రియాక్టర్‌ పేలుడు సంభవించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఫార్మా కంపెనీ యాజమాన్యాలతో పాటు, నిబంధ నలను అమలు చేయని అధికారులపై ప్రభుత్వం దృష్టి సారించినట్లైతే ప్రమాదా లను కొంతమేర కట్టడి చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

భయం… భయం
ఫార్మ కంపెనీ ల్లో వరుస ప్రమాదాలు కార్మికుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పరిశ్రమలశాఖ అధికారుల వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గతేడాది డిసెంబర్‌ 25న విశాఖజిల్లా పరవాడ ఫార్మసిటీలోలారస్‌ రియాక్టర్‌ కింద రబ్బరు అంటుకోవడంతో మంటలు రాసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు చనిపోయారు.
గతేడాది ఏప్రిల్‌ నెలలో ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెం ఫార్మా కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. సుమారు 20 మంది వరకు గాయపడ్డారు.
2015లో లంకెలపాలెంలోని విశాఖఫార్మ సిటీలో సాయినాథ్‌ లైఫ్‌సెన్సర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రియాక్టర్లు పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
అచ్యుతాపురం సెజ్‌లో2020లో విజయశ్రీ ఫార్మ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపడంతో పెను ముప్పు తప్పింది.రెండు వాహనాలు దగ్థం అయ్యాయి.
విశాఖ జిల్లా పరవాడ లోని రాంకీ ఎస్‌ఈటీపీ సాల్వెంట్‌ ఫార్మా కంపెనీలో 2020లో భారీ పేలులు సంభవించింది. పేలుళ్ల కారణంగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడ్డారు.
రేణిగుంట మండలం గాజుల మండ్యంలోని ఫార్మా డ్రగ్‌ కంపెనీలో 2019లో జరిగిన ప్రమాదంలో భారీ ఆస్తినష్టం సంభవించింది. సకా లంలో స్పందించడంతో కార్మికులు గాయాలతో బతికి బట్టకట్టారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement