Friday, April 26, 2024

TS | తెలంగాణలో బీజేపీ పని ఖతం.. చేరికల కమిటీ ఛైర్మన్ చేతులెత్తేశారు: హ‌రీశ్‌రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీజేపీ నేతలపై మంత్రి హరీష్‌ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ చేతులు ఎత్తేశారని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చెప్పేది వేదాంతం.. చేసేది రాద్ధాంతం.. ఆయన కడుపులంతా ఇసం అంటూ మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల గురించి నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీలకు ఏం తెలుస్తుందని చెప్పారు. తెలంగాణ గొప్పతనం నిలిపే విధంగా సెక్రటేరియట్‌ కట్టింది కేసీఆర్‌ అన్నారు. బీజేపీ నాయకులు కూలుస్తాం అన్నారని, కాంగ్రెస్‌ వారు పేల్చేస్తాం అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రానికి కూల్చేవాళ్లు, పేల్చేవాళ్లు కావాలా అని మంగళవారం అచ్చంపేటలో జరిగిన సభలో ప్రజల్ని ప్రశ్నించారు. కృష్ణానది నీళ్లు అచ్చంపేటకు వస్తే రూపు రేఖలు మారిపోతాయని ధీమాను వ్యక్తం చేశారు.

పాలమూరు ప్రగతి పథం
త్వరలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. అచ్చంపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను కూడా ప్రారంభించబోతున్నట్లుగా చెప్పారు. నెట్టెంపాడు, దిండి కూడా పూర్తి అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని అన్నారు. తరతరాలు అచ్చంపేటను గుర్తు పెట్టుకునేలా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేస్తున్నారని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. బీఆర్‌ఎస్‌ అంటే పేదల ప్రజల పార్టీ అని అన్నారు. కాంగ్రెస్‌ పాలన అంటే 24 గంటల విద్యుత్‌ ఉండదని, త్రాగు నీరు ఇవ్వలేరని, 2000 రూపాయల పెన్షన్‌ ఊసే ఎత్తరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పాలన వస్తే రైతు బంధును ఇస్తారా అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే సీఎం కేసీఆర్‌ మాత్రమేనని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అంటే బీజేపీకి భయం, కాంగ్రెస్‌కు కల్వరం పట్టుకుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement