Wednesday, May 15, 2024

బీజేపీ లీడర్​ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు.. నలుగురు నిందితులు, కారు స్వాధీనం

ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడి కిడ్నాప్ కేసును చాకచక్యంగా పోలీసులు ఛేదించారని జిల్లా జిల్లా సురేందర్ రెడ్డి సోమవారం ఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. కాటారం డి.ఎస్.పి బోనాల కిషన్ ఆధ్వర్యంలో మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో నమోదయిన కిడ్నాప్ కేసును పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా ఛేదించారన్నారు. ఈ కేసులో చెల్పూరు గ్రామానికి చెందిన అల్లూరి చిరంజీవిని నిందితుడిగా పేర్కొన్నారు. కర్ర వ్యాపారం చేస్తున్న ఇతను పలిమెల గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఆ మహిళతో మహేష్ రెడ్డి కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో అతనిని కిడ్నాప్​ చేసినట్టు తెలిపారు. దీనికి తాళ్లళపెల్లి రాజు, మొలుగూరి సృజన్, కర్ర వ్యాపారం చేసే క్రమంలో పరిచయమైన పళిమెళ గ్రామానికి చెందిన కుమ్మరి రవిందర్ తో కలిసి ఈ నేరానికి పాల్పడ్డారన్నారు.

ఈ నెల 08వ తేదీన ఘనపూర్ పీఎస్ పరిధిలోని చెల్పూర్ గ్రామం వద్ద ఒక కారులో వస్తున్న అతన్ని అల్లూరి చిరంజీవి, తాళ్ళపెల్లి రాజు బెదిరించి అతని వద్దనుండి ఏటీఎం కార్డు, డబ్బులు తీసుకొని ఘనపూర్ పీఎస్ లో కేసు నమోదు అయినదని తెలిసి తప్పించుకుని తిరుగుతున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా 16వ తేదీన మహేశ్ రెడ్డి బ్యాంకు పని నిమిత్తం మోటార్ సైకిల్ పై ఆసరెల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ముగ్గురు వ్యక్తులు మహేష్ రెడ్డిని బలవంతంగా కారులోకి ఎక్కించుకొని కిడ్నాప్ చేశారన్నారు.

మేడిగడ్డ నుంచి కాలేశ్వరం, అన్నారం, గంగారం, కొయ్యూరు, రుద్రారం, కమలాపూర్ గ్రామాల మీదుగా గొల్ల బుద్ధారం, కాటాపురం తీసుకువెళ్లి అక్కడ ఫోన్ లాక్కొని గ్రామ శివారులోకి తీసుకపోయారని తమ విచారణలో తేలినట్టు ఎస్పీ వివరించారు. తర్వాత కాటపురం నుంచి తాడ్వాయి మేడారం కొండాయి చిన్నబోయినపల్లి ఏటూరునాగారం మంగపేట గ్రామాల మీదుగా మణుగూరు తీసుకువెళ్లి అక్కడ నుంచి భద్రాచలం తీసుకెళ్లి ఒక పెట్రోలు బంకు లో పడుకున్నారని తెలిపారు. 18వ తేదీనాడు ఒడిశాకు తీసుకు వెళ్లి తిరిగి మళ్లీ భద్రాచలం మీదుగా ఎటునాగారం, కన్నాయిగూడెం, మీదుగ వెళ్తుండగా మహేష్ రెడ్డి తన అన్నయ్యకు ఫోన్ చేసి వారు డిమాండ్ చేసిన 8 లక్షల రూపాయల గురించి అడిగాడన్నారు. కిడ్నాప్ చేసిన వ్యక్తులు మహేశ్ రెడ్డి అన్న డబ్బును పంపించగానే ఎవరికి అనుమానం రాకుండా మహారాష్ట్ర కు తీసుకువెళ్లి చంపేద్దాం అనుకుని ప్లాన్ చేసుకున్నారు. అది విన్న మహేష్ రెడ్డి వీళ్ల నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. తన వద్ద ఉన్న లక్ష రూపాయలు బ్యాంకులో డ్రా చేసి ఇస్తానని చెప్పి 20వ తేదీనాడు మహాదేవపూర్ అయ్యప్పస్వామి టెంపుల్ వెనకాల గల అడవి లోకి తీసుకెళ్లాడు.

కాగా, ఈ క్రమంలో 21వ తేదీన ఉదయం 6 గంటలకు మహదేవపూర్ శివారులోని అయ్యప్ప టెంపుల్ వెనకాల అడవిలో మహదేవ్ పూర్ పోలీసులు వారిని పట్టుకున్నారు. చిరంజీవిపై భూపాలపల్లి పియస్ లో ఒక మర్డర్ కేసు, ఘనపూర్ పియస్లో రాబరీ కేసు ఉన్నాయని తెలిపారు. తాళ్లపల్లి రాజుపై ఘనపూర్ పియస్ లో ఆటో అద్దం పగలగొట్టిన కేసు, హత్యాయత్నం కేసు రాబరీ కేసు ఉన్నట్టు ఎస్పీ వివరించారు. ఈ కిడ్నాప్ కేసును చాకచక్యంగా ఛేదించిన మహదేవపూర్ సర్కిల్ పోలీసు టీం, ఐటీ కోర్ సిబ్బంది వేణు, రత్నాకర్ లను భూపాలపల్లి ఎస్పీ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement