Wednesday, May 1, 2024

24న పోడు భూముల ప‌ట్టాల పంపిణి .. జులై నుంచి గృహ‌ల‌క్ష్మీ ప‌థ‌కం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నిరుపేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేయాలని సంకల్పించారు. పేదలు, ఆదివాసీలకు అద్భుత వరాలతో అండగా నిల్చేందుకు సిద్ధమవు తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవరతణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ సందర్భంగా రోజూవారీ కార్యక్రమాల అమలులో భాగంగా పోడు పట్టాల పంపిణీ, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ, గృహలక్ష్మి పథకం అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జులైలోనే దళిత బంధు కొనసాగింపునకు ఏర్పాట్లు ముమ్మరం చేసేలా ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయం లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో పలు నిర్ణయాలకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. జూన్‌ 24 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సోదరులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని నిర్వహించాలని నిర్ణయించారు. వారందరికీ రైతు బంధు వర్తింపజేయాలని అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ద్వారా రైతుబంధు సాయం పొందుతున్న వారితోపాటు నూతనంగా పోడు పట్టాలు అందుకుంటున్న గిరిజన లబ్ధిదారులకు రైతుబంధు వర్తింపజేయాలన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలను తెరిపించి పోడు పట్టాదారులకు నేరుగా ఖాతాల్లో రైతుబంధు జమ చేయాలన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖకు గిరిజన రైతుల బ్యాంకు ఖాతా వివరాలను అందించాలన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఆదేశించారు. పోడు పట్టాల పంపిణీకి తానే స్వయంగా హాజరవుతానని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రకటించారు.

25న కలెక్టర్ల సదస్సు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొననున్నారు.

ఇండ్ల స్థలాల పంపిణీ
ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో మిగిలిపోయి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి వారి ఇండ్ల నిర్మాణాల కోసం దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

జులైలో గృహలక్ష్మి పథకం…
గృహలక్ష్మి పథకానికి సంబంధించి మార్గదర్శకాలను త్వరితగతిన రూపొందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. జులై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపునకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఈ సందర్భంగా ఆదేశించారు.

- Advertisement -

జులై 14న నిమ్స్‌కు శంకుస్థాపన
జూలై 14న వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిమ్స్‌ దవాఖాన విస్తరణ పనులకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. 2000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ భవన నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement