Sunday, May 5, 2024

గుజ‌రాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి బెయిల్

గుజ‌రాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి బెయిల్ ల‌భించింది..ఈ మేరకు ఆయన న్యాయవాది అన్షుమన్ బోరా వెల్లడించారు.
ప్ర‌ధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశార‌న్న కారణంతో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అసోం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అసోంలోని కోక్రాఝార్ కు చెందిన బీజేపీ నేత అరూప్ కుమార్ దేవ్ ఫిర్యాదు మేరకు జిగ్నేష్ మేవానీని గత గురువారం అరెస్ట్ చేశారు. మేవానీ.. ప్రధాని మోడీపై ఎల్లప్పుడూ ప్రతికూల వ్యాఖ్యలు చేస్తుంటార‌ని, తద్వారా ప్రజల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటార‌ని అరూప్ కుమార్ ఆరోపించారు. బీజేపీ నేత ఫిర్యాదు మేరకు అసోం పోలీసుల బృందం గుజరాత్ లోని పలన్ పూర్ లో మేవానీని అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో అసోంలోని కోక్రాఝార్ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం నేడు బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడించింది. 41 ఏళ్ల జిగ్నేష్ మేవానీ వడ్గామ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నట్టు మేవానీ ప్రకటించారు. మేవానీ అరెస్ట్ తదనంతర పరిణామాలపై కాంగ్రెస్ స్పందించింది. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం చూస్తుంటే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పట్ల వారు ఎంత ఆందోళన చెందుతున్నారో అర్థమవుతోందని అధికార బీజేపీపై పరోక్ష వ్యాఖ్యలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement