Tuesday, May 14, 2024

మాజీ రాష్ట్ర‌ప‌తికి అరుదైన గౌర‌వం.. మిధాని ఫ్లై ఓవ‌ర్‌కు అబ్దుల్ క‌లాం పేరు

భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం ప‌ట్ల‌ తెలంగాణ ప్ర‌భుత్వం గొప్ప అభిమానాన్ని చాటుకుంది. ఓవైసీ – మిధాని జంక్ష‌న్ వ‌ద్ద నిర్మించిన ఫ్లై ఓవ‌ర్‌కు అబ్దుల్ క‌లాం పేరును నామ‌కర‌ణం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. డీఆర్‌డీవోలో ప‌ని చేసిన గొప్ప మ‌నిషి అబ్దుల్ క‌లాంకు ఇదే మా నివాళి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఓ ద‌శాబ్ద కాలం పాటు అబ్దుల్ క‌లాం నివాస‌మున్నార‌ని తెలిపారు. ఈ ప్రాంతంతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న క‌లాంకు తెలంగాణ ప్ర‌భుత్వం స‌ముచిత గౌర‌వం క‌ల్పించింది. ఇక ఓవైసీ – మిధాని జంక్ష‌న్ ఫ్లై ఓవ‌ర్‌ను ఎస్ఆర్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ నిర్మించిన‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

న‌గ‌రం తూర్పు ప్రాంతానికి, పాత‌బ‌స్తీకి వార‌ధిగా ఈ ఫ్లైవ‌ర్‌ను నిర్మించారు. ఓల్డ్ సిటీ నుంచి ఎల్బీన‌గ‌ర్ వైపున‌కు ట్రాఫిక్ క‌ష్టాలు తొల‌గ‌నున్నాయి. మిధాని -డీఎంఆర్ఎల్ కూడ‌ళ్ల మ‌ధ్య వాహ‌నాల ర‌ద్దీ త‌గ్గే అవ‌కాశం ఉంది. ఎస్ఆర్డీపీ ప‌థ‌కం కింద రూ. 63 కోట్ల‌తో ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం చేప‌ట్టారు. ఈ ఫ్లైవ‌ర్ మొత్తం పొడ‌వు 1.36 కిలోమీట‌ర్లు కాగా, 12 మీట‌ర్ల వెడ‌ల్పుల్లో 3 వ‌రుస‌లుగా నిర్మించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement